ఎన్డీఏ 2.0 తొలి 100 రోజుల పాలనలో అవినీతి నిర్మూలన, దేశాభివృద్ధి, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తొలగించడానికి ఎన్నో చర్యలు చేపట్టినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా పలు పింఛను పథకాలను ప్రారంభించారు మోదీ.
"కామ్దార్(పనిచేసే), దందార్(దమ్మున్న) ప్రభుత్వాన్ని ఇస్తానని ఎన్నికల సమయంలో మీకు హామీనిచ్చా. ఎలాంటి ప్రభుత్వమైతే.. మీ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం తన శక్తినంతా ధారపోస్తుందో.. అలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ట్రైలర్ను దేశం ఈ 100 రోజుల్లో(ఎన్డీఏ ప్రభుత్వం) చూసింది. ఇక సినిమా బాకీ ఉంది. ముస్లిం సోదరీమణుల హక్కుల రక్షణే మా సంకల్పం. 100 రోజుల్లోపే ముమ్మారు తలాక్ చట్టాన్ని తొలగించాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం మా సంకల్పం. తొలి 100 రోజుల్లోనే ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని మరింత కఠినం చేశాం. జమ్ముకశ్మీర్, లద్దాఖలను అభివృద్ధి చేయడమే మా సంకల్పం. 100 రోజుల్లో దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఒకప్పుడు చట్టాలకు అతీతమనుకున్న వారు.. ప్రస్తుతం కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతున్నారని విమర్శించారు మోదీ.