దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిల్లీ జేఎన్‌యూ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హింసాత్మక ఘటనను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు దిల్లీ పోలీసులు విఫలమయ్యారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెహసీన్ పూనావాలా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
హింసాత్మక ఘటనలను అదుపుచేసేందుకు 2018 జులై 17వ తేదీన అత్యున్నత న్యాయస్థానం కొన్ని మార్గనిర్దేశాలు జారీ చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు పిటిషనర్. ఓ వ్యక్తి లేదా సమూహం గానీ చట్టాన్ని తమ చేతిలో తీసుకోలేరని సుప్రీం స్పష్టం చేసినట్టు తెలిపారు తెహసీన్.
క్యాంపస్‌లోకి దుండగులు చొరబడి కర్రలతో, సుత్తులతో దాడికి పాల్పడినప్పుడు.. వారిని దిల్లీ పోలీసులు అదుపుచేయడానికి ప్రయత్నించలేదని తెహసీన్ ఆరోపించారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలేదని వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని వ్యాజంలో పేర్కొన్నారు.