డౌరీ కాలిక్యూలేటర్ అనే వెబ్సైట్ను నిలిపివేయడంపై వివరణ ఇవ్వాలని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం సమాజంలో ఉన్న వరకట్న వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా రూపొందించిన ఈ వెబ్సైట్ నిలిపివేతకు కారణాన్ని తెలపాలని ప్రశ్నించింది.
డౌరీ కాలిక్యులేటర్ వెబ్సైట్ను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ యజమాని తనుల్ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్పై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పాటిల్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్ వ్యాజ్యంపై మీ విధానమేమిటో తెలపాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక, మహిళ, శిశు అభివృద్ధి, సమాచార శాఖలకు నోటీసులు జారీ చేసింది.
డౌరీ కాలిక్యూలేటర్ అనే వెబ్సైట్ను గతేడాది సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు అనుమతించాలని కోరుతూ యజమాని తనుల్ ఠాకూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వెబ్సైట్లో, వివాహ వరులు వారికి సంబంధించిన సామాజిక, విద్యా, వ్యక్తిగత వివరాలను పొందుపరిస్తే వారికి సరితూగే వరకట్నాన్ని మాత్రమే తమ వెబ్సైట్ అందిస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివాహం కోసం పరిగణనలోకి తీసుకునే చర్మం రంగు వంటి వాటిపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ఉద్దేశంతోనే ఆయా ప్రశ్నలు కోరుతున్నామని వెల్లడించారు.