'ప్లాస్టిక్‌పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!' విందు, వినోదం ఏదైనా సరే.. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ప్లేట్లలోనే భోజనం వడ్డిస్తూ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. అయితే.. ఇప్పటి నుంచి ప్లాస్టిక్ విస్తరులకు బదులుగా ప్రకృతి సహజమైన ఆకు విస్తరులలో భోంచేస్తే.. ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడినవాళ్లం అవుతాం అంటున్నారు ఒడిశా సంబల్పుర్ జిల్లా మహిళలు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ప్రకృతిని రక్షిస్తూనే జీవనోపాధి పొందుతున్నారు.
గుమెయి ప్రాంతం రెంగాలీ అడవిలోని ఆరి వృక్షాల నుంచి ఆకులు సేకరిస్తారు మహిళలు. వాటితో విస్తరాకులు తయారు చేసి, విక్రయిస్తారు. వీరికి జిల్లా అధికారులు సహకారం అందిస్తున్నారు. మహిళలకు శిక్షణ ఇప్పించి, యంత్రాలను అందించే కార్యక్రమాన్ని ఒడిశా అటవీ అభివృద్ధి విభాగం పర్యవేక్షిస్తోంది.
గతంలో ఒక్కో మహిళ రోజుకు సుమారు 100 విస్తరాకులను తయారు చేసేవారు. ఇప్పుడు యంత్రాలు, కుట్టు మెషీన్ల సాయంతో ఒక్కొక్కరు ఐదు వందలకు పైగా ఆకులను తయారు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.
"మేము ఎప్పటి నుంచో ఈ విస్తరాకులు తయారు చేస్తున్నాం. ఇప్పుడు యంత్రాల సాయంతో తయారు చేస్తున్నాం. ప్లాస్టిక్‌ను నిషేధించినందునే మేము వీటి ద్వారా ఉపాధి పొందగలుగుతున్నాం. వీటిలో తింటే ఆరోగ్యం బావుంటుంది. అందుకే మేము ఆకులతో విస్తరులు తయారు చేస్తాం. అందులోనే అన్నం తింటాం. విస్తరాకులతో పర్యావరణం బాగుంటుంది. దీని ద్వారా నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాం కాబట్టి మా కుటుంబం కూడా బాగుంటుంది."
-కళ్యాణి
ఈ పర్యావరణహిత విస్తరులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది వరకు 70 పైసలకు ఒక్క విస్తరాకు అమ్ముడుపోయేది. కానీ ప్లాస్టిక్‌పై నిషేధం తరువాత వీటి ఖరీదు 3 రూపాయల 50 పైసలకు చేరింది.
ప్రస్తుతం సంబల్పుర్ విస్తరులు గోవాకు ఎగుమతి అవుతున్నాయి. త్వరలో ఇవి రాయ్‌పుర్, భోపాల్, కోల్‌కతాకు పంపనున్నట్లు చెబుతున్నారు అధికారులు. భవిష్యత్తులో ప్రతి జిల్లాలోనూ మహిళలకు విస్తరాకు తయారీ యంత్రాలు ఉచితంగా అందిస్తామంటున్నారు.
ఇదీ చదవండి:కోర్టు ఆవరణలోనే కామాంధుడికి దేహశుద్ధి!