బంగాల్ ముర్షిదాబాద్‌లో ఓ యోధుడున్నాడు. స్వాతంత్ర్య సమర యోధులు బ్రిటిషర్ల నుంచి స్వేచ్ఛ కోసం పోరాడితే... ఈ యోధుడు తన ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి నిత్యం శ్రమిస్తున్నాడు. ఆయనే గౌతమ్ చంద్ర బిశ్వాస్. రోజూ ఉదయం తన పడవతో భగీరథీ నదీలో ప్రయాణించి.. ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తూ ఉంటారు. ఎండా, వానా, చలితో సంబంధం లేకుండా ముందుకు సాగుతుంటారు.
"మన గంగా నదిని సుందరంగా తీర్చిదిద్దడానికే నేను ఈ పని చేస్తున్నా. ఈ ప్లాస్టిక్ ఎంతో హానికరం. ఈ ప్రపంచాన్ని మరింత అద్భుతంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తున్నా."
--- గౌతమ్ చంద్ర బిశ్వాస్.
కొన్నేళ్ల క్రితం వరకు గౌతమ్ ఓ మత్స్యకారుడు. నది రోజురోజుకు కలుషితమవడం గమనించారు. అన్నం పెట్టే తల్లికి ఆపదొచ్చిందని చింతించారు. ఆలస్యం చేయకుండా నదిని శుభ్రం చేయడం మొదలు పెట్టారు. ఒకప్పుడు చేపలు పట్టిన గౌతమ్... ఇప్పుడు ప్లాస్టిక్ వేటలో నిమగ్నమయ్యారు. రోజూ ఖాళీ పడవతో వెళ్లి.. ప్లాస్టిక్ సీసాలు, సంచులు, ఇతర వ్యర్థాలను సేకరిస్తూ ఉంటారు.
"ఎంతో కాలం నుంచి ఆయన ఈ పని చేస్తున్నారు. నదిని శుభ్రం చేయడానికి బిశ్వాస్ చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. ప్రభుత్వ సహాయం లేనప్పటికీ... ఎంత చలి ఉన్నా లెక్కచేయకుండా ఈ పనిచేస్తుంటారు."
--- ఆశీమ్ దాస్, స్థానికుడు.