తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2020, 7:38 AM IST

Updated : Jan 10, 2020, 8:12 AM IST

ETV Bharat / bharat

చెక్క దువ్వెనలతో ప్లాస్టిక్ భూతంపై యుద్ధం

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్​కి చెందిన ఛగన్​లాల్ తనదైన కళతో ప్లాస్టిక్​ భూతంపై యుద్ధం చేస్తున్నాడు. ప్లాస్టిక్​తో తయారు చేసిన దువ్వెనలకు దీటుగా కళాత్మకమైన చెక్క దువ్వెనలను తయారు చేసి పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. యావత్​ ప్రపంచం ప్లాస్టిక్​కు బానిసగా మారినా... తనకు పెద్దగా లాభాలు రాకపోయినా ప్రకృతి ఉత్పత్తిని మాత్రం ఆయన ఆపలేదు.

Plastic campaign story Chhaganlal's Kangi Mohalla
చెక్క దువ్వెనలతో ప్లాస్టిక్ భూతంపై యుద్ధం

చెక్క దువ్వెనలతో ప్లాస్టిక్ భూతంపై యుద్ధం

'అప్పట్లో కలప దువ్వెనలతో చిక్కులు తీసి, సౌమ్యంగా దువ్వుతూ ఉంటే ఆహా ఆ సౌఖ్యమే వేరు. ఈ ప్లాస్టిక్​ దువ్వెనల్లో ఏముందీ.. తల్లో పెట్టగానే ఇంత జట్టు ఊడిపోతోంది..' అని అప్పుడప్పుడు అరుగుపై కూర్చొని నిట్టూరుస్తూంటారు అమ్మమ్మలు, తాతమ్మల వయసువారు. వారి మాటలు అక్షరాల నిజమంటాడు మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​కి చెందిన ఛగన్​లాల్. అందుకే కలప దువ్వెనలు తయారు చేసి ఇటు కేశాల ఆరోగ్యాన్ని, అటు పర్యావరణాన్ని కాపాడుతున్నాడు.

దశాబ్దాల క్రితం ఉజ్జయిన్​లోని 'కంగి మొహల్లా'... చెక్కతో చేసే దువ్వెనల హస్తకళకు నెలవు. కానీ ఇప్పుడు ఛగన్​లాల్​ మాత్రమే ఆ వృత్తిని కొనసాగిస్తున్నాడు. యావత్​ ప్రపంచం ప్లాస్టిక్​కు బానిసగా మారినా... తనకు పెద్దగా లాభాలు రాకపోయినా ప్రకృతి ఉత్పత్తిని మాత్రం ఆపలేదు ఆయన. వణుకుతున్న చేతులతోనూ దువ్వెనలు తయారు చేస్తూ ఇప్పటికీ ప్లాస్టిక్ మహమ్మారి​పై బాణం విసురుతున్నాడు.

రోజ్​ వుడ్​తో ఈ దువ్వెనలు తయారు చేస్తాడు. వీటిని స్థానికులు శీషం చెక్క అంటారు. రాజస్థాన్​లోని రుడాలి కళ, ఝార్ఖండ్​లోని రోడ్నా, ఇత్తర్వాల్లా వంటి హస్తకళా దువ్వెనలు పూర్తిగా కనుమరుగువుతున్న వేళ ఛగన్​లాల్​ ఇంకా తన కళను బతికించుకుంటూ... పర్యావరణాన్ని కాపాడుతున్నాడు.

"ఇవి ప్లాస్టిక్​ దువ్వెనల కన్నా చాలా మంచివి. ప్లాస్టిక్​ దువ్వెనలు పర్యావరణానికి హాని చేస్తాయి.. అంతే కాదు జుట్టుకు కూడా చేటు కలిగిస్తాయి. కానీ ఈ కలప దువ్వెన చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. తలకు మంచి రక్తప్రసరణను కలిగిస్తుంది."

-ఛగన్​లాల్

ఏడు దశాబ్దాలుగా ఈ దువ్వెనలను తయారు చేస్తున్నాడు ఛగన్​లాల్​. పాత కలప దువ్వెనలు ఈ ఆధునిక జీవితానికి సరిపోవు అనుకుంటే పొరపాటే... ప్లాస్టిక్​ దువ్వెనల్లోనూ లభించని సరికొత్త డిజైన్లు ఛగన్​లాల్​ దువ్వెనల్లో కనిపిస్తాయి. చేపలు, పక్షుల ఆకారాల్లో అందమైన దువ్వెనలు తయారు చేసి ఆకట్టుకుంటున్నాడు ఛగన్​లాల్​.

వీటి ధర 50 నుంచి 150 మధ్య ఉంటుంది. అనారోగ్యాన్ని బోలెడంత ఖర్చు పెట్టి ప్లాస్టిక్​ రూపంలో కొనుక్కునే బదులు ఆరోగ్యవంతమైన, పర్యావరణహితమైన ఈ దువ్వెనలను వంద రూపాయలు పెట్టి కొనడం మేలంటున్నారు పర్యావరణవేత్తలు.

'కలప దువ్వెనలు వాడితే జుట్టు ఒత్తుగా వస్తుంది. ఈ చెక్క దువ్వెనలను తయారు చేశాక నా తలపై స్వయంగా పరీక్షిస్తాను. ఈ సరుకు అమ్ముడుపోతే పొట్టకూటికి సరిపోయే డబ్బులొస్తాయి. చెన్నై, ముంబయి, దిల్లీలలో ఈ దువ్వెనలను ప్రదర్శించాను. విదేశాల్లోనూ వీటిని విక్రయించాను."
-ఛగన్​లాల్​

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ల​ చేతుల మీదుగా సత్కారాలు పొందాడు ఛగన్​లాల్​. దశాబ్దాలుగా తన వ్యాపారం ఎలా సాగినా.. కళను మాత్రం వదులుకోలేదు​. సమాజాన్ని పట్టి పీడిస్తోన్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టమని ప్రజలకు సందేశాన్నిస్తున్నాడు.

ఇదీ చూడండి:'దిల్లీ ఎన్నికల్లో భాజపా ప్రధాన ప్రచారకర్తగా మోదీ'

Last Updated : Jan 10, 2020, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details