కొవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి దేశంలోనే తొలిసారిగా 'కాన్వలసెంట్ ప్లాస్మా'ను ఉపయోగించాలని కేరళలోని ఒక వైద్య సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కొందరు రోగులపై ప్రయోగాలు నిర్వహించనుంది.
దేశంలో తొలిసారి కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స - china virus
కరోనా బారిన పడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు దేశంలో మొట్టమొదటిసారిగా కాన్వలసెంట్ ప్లాస్మాను ఉపయోగించేందుకు కేరళలోని ఓ వైద్య సంస్థ సిద్ధమైంది. ఈ చికిత్స ప్రక్రియను కొంతమంది రోగులపై ప్రయోగించాలని భావిస్తోంది.
శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) ఈ పరిశోధన నిర్వహించనుంది. ఇది జాతీయ ప్రాధాన్యమున్న సంస్థ. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఇక్కడ కాన్వలసెంట్ ప్లాస్మా పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపిందని ఎస్‌సీటీఐఎంఎస్‌టీ డైరెక్టర్ ఆశా కిశోర్ తెలిపారు. ఔషధ నియంత్రణ సంస్థ, నైతిక విలువల కమిటీ నుంచి అనుమతులు వచ్చాక ఈ నెలాఖరులోగా ప్రయోగాలు మొదలుపెట్టే అవకాశం ఉందని చెప్పారు.
కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న రోగుల రక్తంలోని ప్లాస్మాలో యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఇవి కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయని చెప్పారు. ఈ మహమ్మారి బారినపడ్డ ఇతర రోగులకు వీటితో చికిత్స చేయడం తమ పరిశోధన ఉద్దేశమని ఆమె చెప్పారు. ఇప్పటికే చైనా, అమెరికాలో ఇలాంటి ప్రయోగాలను స్వల్ప స్థాయిలో నిర్వహించారని వివరించారు. అయితే ఇది పనిచేస్తుందన్న బలమైన ఆధారాలేమీ లేవని, అందువల్ల క్లినికల్ ప్రయోగాలను చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు కాన్వలసెంట్ ప్లాస్మా చికిత్సకు మార్గదర్శకాలు దాదాపు ఖరారు కావచ్చాయని ఐసీఎంఆర్ ప్రతినిధి దిల్లీలో చెప్పారు.