విమానం పేల్చేస్తానని బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్ ఎయిర్ ఏసియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన వద్ద బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడింది. ఈ కారణంగా శనివారం రాత్రి కోల్‌కతా నుంచి ముంబయికి బయల్దేరిన విమానం వెనుదిరిగి తిరిగి కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
ఏ సమయంలోనైనా పేలొచ్చనీ...
25 ఏళ్ల మోహినీ మాండల్.. ఎయిర్ ఏసియా (15316) విమానంలో ముంబయికి బయల్దేరింది. విమానం గాల్లోకి ఎగిరిన గంట సమయం తర్వాత ఓ నోట్ రాసి కేబిన్ సిబ్బందికి ఇచ్చింది. దాన్ని విమాన కెప్టెన్‌కు ఇవ్వమని సూచించింది. ఆ నోట్లో తన శరీరం చుట్టూ బాంబులున్నాయనీ, అవి ఏ క్షణంలోనైనా పేలొచ్చని రాసింది. విషయం తెలుసుకున్న పైలట్లు అధికారులకు సమాచారం అందించి.. విమానాన్ని వెనక్కి మళ్లించారు.
రాత్రి 11:46 గంటలకు విమానం కోల్‌కతా విమానాశ్రంలో ల్యాండింగ్ అయిన తర్వాత అందులో క్షుణ్నంగా తనిఖీ చేశారు అధికారులు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో తన వద్ద ఎలాంటి బాంబులు లేవని చెప్పటం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహిళ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు తిరిగి ముంబయికి పంపించారు.
ఇదీ చదవండి:రాజస్థాన్‌లో పండగ కోసం ముస్తాబైన 'ఒంటెలు'