తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై పోరు: టీకా రాకుంటే.. ప్లాన్‌- బీ తప్పదు - a vaccine to eradicate the coronavirus

కరోనాను నయం చేసే టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కరోనా టీకాను తయారుచేసేందుకు పలు పరిశోధనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నా... అది ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చికిత్స విధానాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మనం 'ప్లాన్‌-ఎ'తో పాటు 'ప్లాన్‌-బీ'ని కూడా సిద్ధం చేసుకోవాలి.

Plan-B should be implemented if there is no vaccine to eradicate the corona.
టీకా రాకుంటే.. ప్లాన్‌-బీ తప్పదు

By

Published : May 11, 2020, 6:45 AM IST

కరోనా దెబ్బకు కంగుతిన్న ప్రపంచం ఇప్పుడు టీకా వైపు ఆశగా చూస్తోంది. టీకా ఒక్కటే ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలదని బలంగా విశ్వసిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌ వంటి వారు సైతం టీకా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టీకా తయారీలో దాదాపు 100కు పైగా కంపెనీలు తలమునకలై ఉన్నాయి. వీరి ఆశావహ దృక్పథాన్ని తప్పుపట్టలేం. కానీ నాణేనికి రెండో వైపు కూడా తెలుసుకోవాల్సిన సమయం ఇది. అసలు టీకా వస్తుందా? వస్తే ఎప్పట్లోపు? అలా వచ్చిన టీకా సమర్థంగా పనిచేస్తుందా? ఒకవేళ టీకానే రాకపోతే పరిస్థితి ఏమిటి? అనే భిన్నమైన భవిష్యత్‌ పరిణామాలపై నిపుణుల విశ్లేషణను తెలుసుకుందాం.

"మనం టీకాలను అభివృద్ధి చేయలేకపోయిన వైరస్‌లు చాలానే ఉన్నాయి. కరోనా వైరస్‌కు టీకా వస్తుందని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. వచ్చినా.. అది సురక్షితమే అని, అన్ని పరీక్షల్లో విజయం సాధిస్తుందనీ చెప్పలేం’’

- డాక్టర్‌ డేవిడ్‌ నాబర్రో, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌

మనం ఏ టీకాను కూడా ఏడాది, ఏడాదిన్నరలో పూర్తిగా అభివృద్ధి చేయలేదు. అలాగని అదేమీ అసాధ్యమని చెప్పడం లేదు. కానీ, అలా చేస్తే మాత్రం అదో చరిత్రే అవుతుంది. మనం ‘ప్లాన్‌-ఎ’తో పాటు ‘ప్లాన్‌-బీ’ని కూడా సిద్ధం చేసుకోవాలి’’

- డాక్టర్‌ పీటర్‌ హాటెజ్‌, డీన్‌, ది నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, హూస్టన్‌

సాధారణ ఇన్‌ఫ్లూయంజా వైరస్‌లో మార్పులు జరగడానికి ఏడాది సమయం పట్టొచ్చు. కానీ, హెచ్‌ఐవీ వైరస్‌ మనలోకి వచ్చాక కూడా క్రమం తప్పకుండా మార్పులకు లోనవుతుంటుంది. అంటే ఆ వైరస్‌ సోకిన వ్యక్తికి వేల రకాల హెచ్‌ఐవీ సోకినట్లే. అందుకే దానికి టీకా తయారీ కష్టమైపోతోంది. కరోనా వైరస్‌ కూడా వేగంగా మార్పులు చెందితే.. దానికి చికిత్స కష్టమే’’.

- డాక్టర్‌ పౌలా ఆఫిట్‌, రొటా వైరస్‌ టీకా సహ ఆవిష్కర్త

రెండో ప్లాన్‌ ఎందుకు?

కరోనా వైరస్‌కు అసలు టీకా అనేది రాకపోతే అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వాలకు 'ప్లాన్‌-బీ' ఉండాలని చరిత్ర చెబుతోంది. గతంలో వెలుగుచూసిన ఎన్నో వైరస్‌లకు టీకాలు రాలేదు. కానీ, కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో వాటికి అడ్డుకట్ట వేశాం. దీంతో మన జీవనం ఎక్కడా ఆగలేదు. వీటన్నిటి కంటే కరోనా వైరస్‌ భిన్నమైంది. ఒకవేళ దీనికి టీకా అందుబాటులోకి రాకపోతే మన జీవన విధానం మునుపటిలా ఉండే అవకాశమే లేదు. పరీక్షలు, క్వారంటైన్‌లు, ఐసోలేషన్లు మన జీవితంలో భాగమైపోతాయి. చికిత్స వచ్చినా.. ఏటా ఎక్కడో ఒకచోట కరోనా వైరస్‌ బుస కొడుతూనే ఉండొచ్చు. ప్రజలు, సమాజం కూడా వైరస్‌ నుంచి తప్పించుకుంటూ జీవనం కొనసాగించే విధంగా సిద్ధపడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

గత వైరస్‌లకు టీకాలు ఏవీ?

1984లో హెచ్‌ఐవీ అనే మహమ్మారిని కనుగొన్నట్లు అప్పటి అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి మార్గరెట్‌ హెక్లర్‌ ప్రకటించారు. మరో రెండేళ్లలో టీకాను సిద్ధంచేసి ప్రయోగాలు మొదలుపెడతామని నమ్మకంగా చెప్పారు. కానీ, ఇప్పటికి దాదాపు 36 ఏళ్లు గడిచిపోయాయి. హెచ్‌ఐవీ సోకి 3.2 కోట్ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హెచ్‌ఐవీ టీకా కోసం ప్రపంచం ఇంకా ఎదురుచూస్తోంది. ఎయిడ్స్‌ భయం నుంచి సమాజం ఇప్పటికీ కోలుకోలేదు. హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి జీవితం చివరి రోజుల్లో ఎంతటి దుర్భరంగా మారుతుందో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. 1997లో బిల్‌ క్లింటన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో- 'పదేళ్లలో హెచ్‌ఐవీకి టీకాను తీసుకొస్తాం' అని ప్రకటించారు. ఆ గడువు తీరి ఇప్పటికి దాదాపు 13 ఏళ్లు దాటిపోయింది. ఒక్క హెచ్‌ఐవీకే కాదు.. డెంగీ వైరస్‌కు కూడా ఇప్పటికీ టీకా రాలేదు. 2017లో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అంతేకాదు ప్రమాదకరమైన రైనో వైరస్‌, అడెనో వైరస్‌లకు కూడా టీకాల్లేవు. అడెనో వైరస్‌లో రెండు రకాలను అడ్డుకోవడానికి మాత్రం ఓ టీకా ఉంది. హెచ్‌ఐవీతో పోలిస్తే కరోనా వైరస్‌లో కొంచెం మందకొడిగా మార్పులు చేసుకోవడం ఒక్కటే టీకా తయారీకి సానుకూలాంశం.

ప్రత్యామ్నాయాలకు సిద్ధమేనా?

టీకా తయారీలో పరిష్కారం లభించకపోతే చికిత్స విధానంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో హెచ్‌ఐవీ వంటి వైరస్‌లకు టీకాలు రాకపోయినా.. యాంటీవైరల్‌ ఔషధాలను అభివృద్ధిచేసి బాధితుల ఆయుష్షును పెంచుతున్నాం. దీంతో 1980ల్లో మాదిరి భయపడాల్సిన అవసరం తప్పింది. క్యాన్సర్‌ విషయంలో కూడా మనం ఔషధాలను అభివృద్ధిచేశాం. వ్యాధి బారిన పడే అవకాశం ఉన్న వారిని కాపాడటం కోసం ముందు జాగ్రత్త ఔషధాలను అభివృద్ధి చేస్తున్నాం. ఎబోలా ఔషధం రెమిడెసివిర్‌, ప్లాస్మా చికిత్స, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వంటి వాటిని తాత్కాలికంగా చికిత్సలకు ఉపయోగిస్తున్నాం. తొలుత వీటి ప్రయోగాలకు శాస్త్రవేత్తల నుంచి విముఖత వచ్చినా.. కొన్ని సానుకూల ఫలితాలు వస్తుండటం.. రోగులు కోలుకొనే సమయాన్ని కుదించి వైద్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గిస్తున్నందున ప్రభుత్వాలు పచ్చజెండా ఊపుతున్నాయి. ఈ చికిత్స విధానాలు సమాజంలో భయాలను తగ్గించి సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉపయోగపడతాయి.

వ్యాక్సిన్‌ లేకుంటే ఎలా?

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను బట్టి చూస్తే టీకా లేకుండా జీవనం సాధారణ స్థితికి చేరడం అసాధ్యం. అలాగని నిరవధిక లాక్‌డౌన్‌లు ఆర్థికంగా దేశాలను కుంగదీస్తాయి. ఈ నేపథ్యంలో వ్యాధిని అదుపుచేసే వ్యూహాలు కావాలి. ఇందుకోసం ప్రజలు కూడా మానసికంగా సిద్ధంకావాలి. వారిలో కొవిడ్‌-19 లక్షణాలు కనిపించిన వెంటనే స్వచ్ఛందంగా వెళ్లి చికిత్స చేయించుకోవాలి. సమాజం కూడా వారిని వెలివేసినట్లు చూసే తీరును మార్చుకోవాలి. చికిత్స చేయించుకొన్న వారిని అభినందించటం అలవరచుకోవాలి. వ్యాధి నుంచి తప్పించుకోవడం అనేది సమష్టి బాధ్యత అని గుర్తించాలి. అనారోగ్య లక్షణాలున్న ఉద్యోగి ఇంటి వద్ద నుంచే పనిచేసేలా సంస్థలు ఏర్పాట్లు చేసుకోవాలని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన డాక్టర్‌ డేవిడ్‌ నాబర్రో వివరించారు. ప్రజల మధ్యలోకి వెళ్లే వారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే కొన్ని ఐరోపా దేశాలు భౌతిక దూరం నిబంధనలను వ్యాపారంలో భాగంగా మార్చేశాయి. హోటళ్ల సామర్థ్యాలను బాగా కుదించాయి. ఏ దేశమూ దీన్నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదు. పేద దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు సాయం అందిస్తేనే కొవిడ్‌ను రూపుమాపడం సాధ్యం. అందుకే ముందు జాగ్రత్త వ్యూహంలో భాగంగా ఇప్పటికే పాలకులు ‘ప్లాన్‌-బి’కి కూడా ప్రజలను మానసికంగా సిద్ధంచేస్తున్నారు.

టీకా రేసులో ఎన్ని సంస్థలు?

కరోనా వైరస్‌కు టీకాను కనుగొనే రేసులోకి దాదాపు 100కుపైగా సంస్థలు వచ్చిచేరాయి. దాదాపు డజను సంస్థలు ప్రయోగ పరీక్షల దశకు చేరాయి. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా మన రోగనిరోధక శక్తి పోరాడేలా శిక్షణ ఇచ్చేట్లు వీటిని డిజైన్‌ చేస్తున్నారు. చైనాలోని సైనోవాక్‌ సంస్థ అచేతనమైన వైరస్‌లను వాడి ప్రయోగాలు చేస్తుండగా.. కాన్‌సినో బయాలజిక్‌ సంస్థ జలుబు వైరస్‌లను వాడుతోంది.. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ జన్యుకోడ్‌ను ఆధారంగా చేసుకొంది.. ఇక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చింపాంజీల నుంచి సేకరించిన వైరస్‌ను వాడి పరిశోధనలు చేస్తోంది. ఫలితాలు సానుకూలంగా ఉంటాయని ఆయా సంస్థలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. మనం యంత్రాలపై ప్రయోగాలు చేయడంలేదు. జీవులపై చేస్తున్నాం. శరీరాలు ఎలా స్పందిస్తాయనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చివరి పరీక్షలో కూడా ఇవి సురక్షితమే అని రుజువు కావాలి.

ఇదీ చూడండి:ఆపరేషన్​ కరోనా: ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని భేటీ

ABOUT THE AUTHOR

...view details