దృఢ నిర్ణయాలు తీసుకోవటంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సరితూగే నాయకుడు లేడని కేంద్ర రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో 300పైగా స్థానాల్లో భాజపా గెలుస్తుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి 367కు మించి సీట్లు పొందుతుందని 'ఈనాడు' ముఖాముఖిలో ధీమా వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి?
మన దేశ జనాభా 130 కోట్లు. కుల-మత వివక్ష లేకుండా అభివృద్ధి జరగాలి. వెనుకబడిన రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందాలి. దేశ సమైక్యతను కాపాడే, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగే నేతను ప్రజలు కోరుకుంటున్నారు. ఇది మోదీతోనే సాధ్యం.
పార్టీ కురువృద్ధుడు అడ్వాణీతో పాటు దత్తాత్రేయ వంటి సీనియర్లను పక్కన పెట్టారన్న విమర్శలపై ఏమంటారు?
సీనియర్ నేతలను భాజపా విస్మరించలేదు. మేము వారిని ఎంతో గౌరవిస్తాం. ప్రభుత్వానికి, పార్టీకి వారి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. నా తల్లి ముంబయి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 65 ఏళ్లకు రాజకీయాల నుంచి ఆమె తప్పుకున్నారు.