తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆశయానికి గజ్జెకట్టి.. అంగవైకల్యాన్ని తిప్పికొట్టిన యక్ష'గనుడు' - telugu news

ఎవరైనా నృత్యం చేయాలంటే రెండు కాళ్లకు గజ్జెలు కట్టాలి. అవి పాట, తాళానికి తగ్గట్లు లయతో ఆడాలి. ఒక్క కాలికి ఇబ్బంది ఉన్నా ప్రదర్శన దెబ్బతింటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ యువకుడు​ మాత్రం కృత్రిమ కాలుతోనే యక్షగానంలో ప్రావీణ్యం సంపాదించాడు. అతడి ప్రదర్శన చూసిన వీక్షకులు ఔరా అంటూ.. తనలోని పట్టుదల, గుండె ధైర్యానికి సలాం చేస్తున్నారు.

Physical Disableness Doesn't Matter to reach the Goal and to achieve
ఆశయానికి గజ్జెకట్టి.. అంగవైకల్యాన్ని తిప్పికొట్టిన యక్ష'గనుడు'

By

Published : May 19, 2020, 9:32 PM IST

'జీవితంలో ఒడుదొడుకులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ నా ఆత్మవిశ్వాసం ఎప్పటికీ నాతోనే ఉంటుంది' అంటున్నాడు కర్ణాటకకు చెందిన మనోజ్​. కాలు పోయింది.. జీవితం కాలిపోయింది అనుకోకుండా.. ముందడుగు వేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యక్షగనుడు.

అంగవైకల్యాన్ని తిప్పికొట్టిన యక్ష'గనుడు'

ఒక్క పాదంతో అడుగేశాడు

దక్షిణ కర్ణాటకలోని బెల్తాంగడికి చెందిన 17 ఏళ్ల మనోజ్​.. ఆరో తరగతి చదువుతన్నప్పుడు ఎడమకాలికి ఓ పుండైంది. అదికాస్తా పెద్దదై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో డాక్టర్లు ​కాలు తీసేయకపోతే మనోజ్ ప్రాణానికే ప్రమాదమన్నారు. చివరికి శస్త్ర చికిత్స చేసి కృత్రిమ కాలు అమర్చారు.

అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగిన మనోజ్​ ఒక్కసారిగా కాలు లేక కొన్ని రోజులు గుండెలు పగిలేలా ఏడ్చాడు. కానీ, ఆ దిగులుతోనే కాలం వెల్లదీయాలనుకోలేదు. ఇకపై ఒంటి కాలుతోనే బతకాలనే వాస్తవాన్ని జీర్ణించుకున్నాడు. ఒక్క పాదంతోనే కొత్త జీవితం వైపు కదంతొక్కాడు. అందరితోపాటు బడికి వెళ్లడం మొదలెట్టాడు.

కాలు లేదని కనిపెట్టనీయడు

పాఠశాల ప్రిన్సిపల్​ వెంకటేశ్​ తులుపురే ప్రోత్సాహంతో... కన్నడనాట ప్రఖ్యాతిగాంచిన 'యక్షగాన' కళను నేర్చుకున్నాడు మనోజ్​. అతితక్కువ రోజుల్లోనే అందులో ప్రావీణ్యం సంపాదించాడు. ఒకే కాలుపై భారం వేసి నృత్యం చేస్తున్నాడనే సంగతి ఎదుటివారికి తెలియకుండా.. ముఖంలో హావభావాలని పలికించేవాడు. పురాణ గాథల్లోని డైలాగు​లను కంఠస్థం చేసేశాడు. మనోజ్​ పట్టుదలను చూసి, ఓ యక్షగాన బృందం వేదికపై తన కళను ప్రదర్శించే అవకాశమిచ్చింది.

వేదికపై మనోజ్​ పలికించిన నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇంకేముంది ఆ జిల్లాలోనే ప్రముఖ యక్షగాన బృందాల్లో ఒకడయ్యాడు. దాచుకున్న డబ్బులతో కృత్రిమ కాలు పెట్టించుకున్నాడు. అయితే, చాలీచాలని సంపాదనతో కాలం వెల్లదీయడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తల్లితో కలిసి మామయ్య ఇంట్లో ఉంటున్నట్లు చెప్పాడు.

ఇప్పటి వరకు మనోజ్​కు ఆధార్​ కార్డు లేక.. ప్రభుత్వ పథకాలేవీ అందకపోయినా.. పక్కవారిపై ఆధారపడలేదు. తన మనోస్థైర్యంతో ఎందరికో స్ఫూర్తినిస్తున్నాడు. యక్షగానమే జీవితంగా బతుకుతున్న తనకు అవకాశాలు కల్పిస్తే.. గొప్ప స్థాయికి ఎదిగి చూపిస్తానంటున్నాడు.

ఇదీ చదవండి:మనసుకే చేతులుంటే.. మాస్కులు కుడతానంటే?

ABOUT THE AUTHOR

...view details