పక్క వీధిలో కరోనా సోకిన వ్యక్తి ఉన్నాడంటేనే ప్రాణం గజగజలాడిపోతుంది. అలాంటి 24 గంటలు కరోనా రోగుల పక్కనే ఉంటూ ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తారు వైద్యులు. దిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు అయితే వైద్యంతో పాటు .. నిర్బంధంలో ఉన్న రోగుల ఒంటరితనాన్నీ దూరం చేస్తున్నారు.
బతుకుపై భరోసా కల్పిస్తూ....
తూర్పు దిల్లీలో 500 పడకల సౌకర్యంతో.. కరోనా బాధితులకు వైద్యం అందిస్తోంది రాజీవ్ గాంధీ ఆసుపత్రి. నెల రోజుల నుంచి 'మే ఐ హెల్ప్ యూ' బృందాన్ని ఏర్పాటు చేసి రోగులతో ముచ్చటిస్తూ.. వారికి బతుకుపై భరోసా కల్పిస్తోంది.
"'చేరుకోలేని వారిని చేరుకుందాం' అనే నినాదంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. నిర్బంధంలో ఉన్నవారిలో ఒంటరితనాన్ని పోగొట్టి, బతుకుపై ఆశలు పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా నర్సులు బాధితులకు స్వయంగా ఫోన్లు చేస్తారు. వీలుంటే దగ్గరగా వెళ్లి మాట్లాడతారు. బాధితులు వారి అభిప్రాయాలను, జీవితంలో జరిగిన సంఘటనలను మాతో పంచుకుంటారు. ఆసుపత్రిలో అసౌకర్యాలేమైనా ఉంటే చెప్పుకుంటారు. వాటిని మేము పరిష్కరిస్తాం."
-డా. బీఎల్ శేర్వాల్, ఆసుపత్రి డైరక్టర్