కరోనాకు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా.. మెరుగైన రోగ నిరోధక ప్రతిస్పందనలు కలిగించిందని తేలింది. టీకా తీసుకున్న వలంటీర్లలో తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తలేదని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఫేజ్-1 ఫలితాల్లో స్పష్టమైంది.
అన్ని గ్రూపుల వలంటీర్లు టీకాను సమర్థంగా తట్టుకున్నారని అధ్యయన రచయితలు తెలిపారు. రోగ నిరోధక శక్తి మెరుగైందని చెప్పారు. టీకా వల్ల తలెత్తిన ప్రభావాలన్నీ స్వల్ప స్థాయిల్లోనే ఉన్నాయని వెల్లడించారు. ప్రతికూల ప్రభావానికి సంబంధించి ఓ కేసు నమోదైనప్పటికీ.. అది టీకాకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు.
ఈ అధ్యయనానికి భారత్ బయోటెక్ నిధులు సమకూర్చింది. ఇలాంటి ఫలితాలే డిసెంబర్లో 'మెడ్ఆర్క్సివ్' వెబ్సైట్లో ప్రచురితమయ్యాయి.
జ్వరం, అలసట మాత్రమే
దేశవ్యాప్తంగా 11 ఆస్పత్రులలో ఫేజ్ 1 ట్రయల్స్ జరిగాయి. 18-55 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులపై ఈ ట్రయల్స్ చేశారు. గతేడాది జులై 13-30 మధ్య 375 మంది టీకా స్వీకరించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 100 మందిని టీకా గ్రూప్, 75 మందిని కంట్రోల్ గ్రూప్‌గా విభజించారు. 14 రోజుల తేడాతో వీరికి రెండు డోసులను అందించారు. ఇందులో కొంతమందికి టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి, జ్వరం, అలసట, తలనొప్పి వంటి స్వల్ప లక్షణాలు కనిపించాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనం పేర్కొంది.
13 వేల మందికి రెండో డోసు
మరోవైపు, కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 13 వేల మంది వలంటీర్లకు రెండో డోసు అందించినట్లు భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్ల తెలిపారు. టీకా ప్రయోగానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారికి ధన్యవాదాలు తెలిపారు. చివరి విడత ట్రయల్స్ కోసం 25,800 మంది వలంటీర్లను చేర్చుకున్నట్లు గతంలో వెల్లడించారు సుచిత్ర.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(పుణె), ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకా అభివృద్ధి చేసింది. దీని అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతించింది. టీకా మూడో దశ ప్రయోగ ఫలితాలు వెలువడాల్సి ఉంది.
ఇదీ చదవండి:టీకాపై అపోహలు తొలగించండి: మోదీ