ఉన్నత చదువు. మంచి ఉద్యోగం, వేతనం. హాయిగా సాగుతున్న కుటుంబ జీవితం. అయితే ఇవేవీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. అనాథ జంతువులకు ఆపద్బాంధవుడయ్యారు. మూగ జీవాలపై మమకారంతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో కోల్పోయినప్పటికీ వాటి సేవలోనే తరిస్తూ అందులోనే సంతృప్తి పొందుతున్నారు గోపాలకృష్ణన్.
తమిళనాడులోని తిరువారూర్ జిల్లా నెయ్ కుప్పై గ్రామానికి చెందిన గోపాలకృష్ణన్ ఎంసీఏ చదివారు. మధురై, బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. జీవకారుణ్యంపై మమకారంతో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు.
"సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో మంచి జీతం విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకుని ఏడెనిమిది కుక్కలతో నేను మా ఊరు వచ్చాను. మా ఊళ్లో కూడా జంతువులను హింసిస్తే ఉండలేక పోయాను. పశు సంక్షేమం అని ప్రభుత్వంలో ఓ శాఖ ఉంది. అది నామమాత్రంగా ఉండకూడదు. నాలా జంతువులను పరిరక్షిస్తున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే బావుంటుంది."
-గోపాల కృష్ణన్
ఐదేళ్ల క్రితం ఏం జరిగిందంటే..
ఐదేళ్ల క్రితం గోపాలకృష్ణన్ మధురైలో ఉద్యోగం చేసే రోజుల్లో రహదారిపై బండికింద పడి దెబ్బ తగిలిన వీధి కుక్కను తన అద్దె ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించి పెంచారు. అనంతరం దారిలో ఎక్కడైనా దెబ్బ తగిలిన వీధి కుక్కలు కనిపిస్తే తీసుకొచ్చి వైద్యం చేసి పెంచడం మొదలు పెట్టారు. కుక్కల గోల తాము భరించలేక పోతున్నామని ఇరుగుపొరుగు వారు అనడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంతూరు వెళ్లి అక్కడ తన ఇంట్లో వాటికి చోటు కల్పించారు.