దిల్లీ అల్లర్లకు పాల్పడిన వారిపై కుల, మత, పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అల్లర్లు జరిగే ముందు విదేశీ నిధులు పంపిణీ జరిగినట్లు సమాచారం లభించినట్లు తెలిపారు.
దిల్లీ హింసాత్మక ఘటనపై రాజ్యసభలో చర్చ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు అమిత్ షా. ఇప్పటి వరకు 700 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 2,600 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
"అల్లర్లు సృష్టించిన వారు, మద్దతు ఇచ్చిన వారు ఏ కులానికి, మతానికి, పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టేది లేదు. పెద్ద ఎత్తున మాకు సాంకేతిక ఆధారాలు లభించాయి. ముఖాన్ని గుర్తించే సాప్ట్వేర్ను వినియోగిస్తున్నాం. దాని కోసం ఆధార్ సమాచారాన్ని వినియోగించలేదు. నిన్న కొన్ని మీడియాల్లో తప్పుడు సమాచారం ప్రసారమైంది. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీల సమాచారం మాత్రమే ముఖాలను గుర్తించేందుకు ఉపయోగించాం. ఇంత భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగినప్పుడు.. పోలీసులకు అధికారం ఇవ్వాలా వద్దా? ఈ అల్లర్లను సృష్టించిన వారిని గుర్తించి కోర్టు ముందు నిలబెడతాం. కఠినంగా శిక్షించి తీరుతాం. ఇందులో మేము సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు."