తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్మూలనలో ఆ గ్రామం దేశానికే ఆదర్శం - parinad latest news

కేరళ కొల్లం జిల్లాలోని పెరినాడ్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు 40 మంది స్థానిక మహిళలు. స్వయంగా ప్రజల ఇళ్లకు వెళ్లి ప్లాస్టిక్​ను సేకరిస్తున్నారు. వీటితో పౌడర్​ను తయారీ చేసి రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ గ్రామాన్ని దేశమంతా ఆదర్శంగా తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్​ సూచించింది.

plastic wastage
ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్మూలనలో ఆ గ్రామం దేశానికే ఆదర్శం

By

Published : Dec 30, 2019, 7:32 AM IST

ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్మూలనలో ఆ గ్రామం దేశానికే ఆదర్శం

పర్యావరణ హితానికై ప్లాస్టిక్ భూతాన్ని గ్రామం నుంచి తరిమికొట్టాలని తీర్మానించుకున్నారు కేరళ కొల్లం జిల్లా పెరినాడ్​ గ్రామానికి చెందిన 40 మంది మహిళలు. తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని 'హరిత కర్మ సేన'ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి నివాసానికి వెళ్లి ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరిస్తున్నారు.

" ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరించేందుకు ప్రజల ఇళ్లకు వెళ్లినప్పడు వాళ్లే శుభ్రం చేసి ఇస్తారు. హరిత కర్మ సేన వాటిని సేకరించి ఓ కార్డును ఇస్తుంది. స్థానికుల సహకారం చాలా బాగుంది. "
-శిర్లే, హరిత కర్మ సేన సభ్యురాలు

ప్లాస్టిక్ పౌడర్​తో రోడ్లు..

ఇళ్ల నుంచి సేకరించిన ప్లాస్టిక్​ను ప్రాసెసింగ్​ యూనిట్​కు తరలిస్తోంది హరిత కర్మ సేన. ఆ తర్వాత దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేసి పొడిని తయారు చేస్తున్నారు. ఈ పొడిని క్లీన్​ కేరళ కంపెనీకి సరఫరా చేస్తున్నారు. తారు రోడ్ల కోసం ఈ ప్లాస్టిక్ పొడిని ఉపయోగిస్తుంది ఆ సంస్థ.

ఈ ప్రాసెసింగ్ యూనిట్​ను శిర్లే సహా ముగ్గురు మహిళలు నిర్వహిస్తారు. పొరుగు గ్రామ పంచాయతీలు, కేరళలోని ఇతర గ్రామాలు ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్వహణకు తమ సాయం కోరుతున్నారని వారు చెప్పారు.

దేశానికే ఆదర్శం

వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్​ నిర్మూలనలో పెరినాడ్​ను దేశమంతా ఆదర్శంగా తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ చర్యల అమలులో ఈ గ్రామాన్ని ఓ ఉదాహరణగా ఎంపిక చేసింది. ప్లాస్టిక్​ రాకాసిపై పోరాటం ఎలా చేయాలో పెరినాడ్​ను చూసి నేర్చుకోవాలని కొనియాడింది.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు హరిత కర్మ సేన ఆలోచన అందరినీ మెప్పించింది. డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణకు ఎలక్ట్రానిక్​ విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో వీరు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details