భాజపా సీనియర్ నేత, కర్ణాటక చిత్రదుర్గ ఎంపీ నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం తన సొంత నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పర్యటించాలనుకున్న ఆయనను అడ్డగించారు గ్రామస్థులు. తక్కువ కులానికి చెందిన వారని తీవ్ర అవమానానికి గురిచేశారు. గ్రామంలోకి అనుమతించమని స్పష్టం చేశారు.
నారాయణస్వామి పెమనహళ్లి గొళ్లారహత్తి గ్రామాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే.. మూఢనమ్మకాలపై అపారమైన విశ్వాసమున్న గ్రామస్థులు ఆయనను అడ్డగించారు. ఇదే విషయమై ఊర్లోని ఓ పెద్దాయన నేరుగా ఎంపీకే బదులిచ్చారు.
''ఇది మా సంప్రదాయం. మేం తక్కువ కులం వారిని మా గ్రామంలోకి అనుమతించం. మేం అలాంటి వారిని మా ఆధ్యాత్మిక ప్రదేశాలకు దూరంగా ఉంచాలనుకుంటాం. ఎన్నో ఏళ్లుగా ఇదే పాటిస్తున్నాం. అందుకే మేం మిమ్మల్ని కూడా ఊర్లోకి రానీయం.''