హెల్మెట్.. ద్విచక్రవాహనదారులకు రక్షణకవచం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది. అందుకే ద్విచక్రవాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే.. వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయినా చాలా చోట్ల శిరస్త్రాణం లేకుండా వెళ్తన్న ద్విచక్రవాహనదారులు కనిపిస్తూనే ఉంటారు.
అయితే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని దయాల్బాగ్లో శిరస్త్రాణం ప్రాముఖ్యత గుర్తించి ద్విచక్రవాహనదారులే కాదు, సైకిల్, కారు నడిపేవారితో పాటు పాదచారులు కూడా హెల్మెట్‌ను ధరించి అవగాహన కల్పిస్తున్నారు.
రోడ్డుభద్రతపై సందేశం..
దయాల్బాగ్ ప్రజలు రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు హెల్మెట్‌ను తమ జీవితంలో భాగం చేసుకున్నారు. యువకులు, చిన్నారులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, మహిళలు, పురుషులు, ముసలివారు ఇలా అందరూ హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు.
కారణం ఇదీ..
ఇటీవల రోడ్డు భద్రత, ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు అధికారులు. హెల్మెట్ ధరిస్తే కలిగే ఉపయోగాలను సవివరంగా చెప్పారు. దీంతో అధికారుల సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు దయాల్బాగ్ ప్రజలు. పాదచారులు, సైకిల్, కారులో రోడ్డుపై వెళుతున్నప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉందో ఊహించలేమని అందుకే హెల్మెట్ ధరిస్తున్నట్లు చెబుతున్నారు.