లాక్డౌన్ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో ఎంతో మందికి ఊరట కలిగింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూనే.. బయటికొచ్చి తమ తమ అవసరాలు తీర్చుకుంటున్నారు సాధారణ ప్రజలు. మందుబాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గ్రీన్జోన్లు సహా కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ప్రకటనతో.. ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు లిక్కర్ప్రియులు. ఉదయం నుంచే మద్యం షాపుల ముందు బారులు తీరారు. అదీ భౌతిక దూరం పాటిస్తూ.
దిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది యడియూరప్ప సర్కార్. ఫలితంగా బెంగళూరు, హుబ్లీ పరిసర ప్రాంతాల మద్యం దుకాణాల ముందు వందల మీటర్ల మేర లైన్లలో నిల్చొన్నారు.
దిల్లీ లక్ష్మీ నగర్లోనూ మందుబాబులు బారులు తీరారు.