జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితాలో పేరు లేని అసోం నివాసితుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. వారిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు ఉండవని తెలిపింది. వారికి చట్ట ప్రకారం లభించే అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తాయని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో పేరు లేని వారిని అదుపులోకి తీసుకోబోమన్నారు.
"ఎన్‌ఆర్‌సీ జాబితా విధానాన్ని సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం జాబితాను రూపొందించింది. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన తుది గడువులకు అనుగుణంగా జాబితాను తయారు చేశాం. ఎన్‌ఆర్‌సీ జాబితాను శాస్త్రీయ పద్ధతి ఆధారంగా పారదర్శకంగా రూపొందించాం. దరఖాస్తులను, ఇంటింటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని జాబితాను రూపొందించాం. జాబితాలో పేరు దక్కని వారు 120 రోజుల్లో ట్రైబ్యునళ్లలో అప్పీలు చేసుకునే హక్కు ఉంది. న్యాయ విచారణ ముగిసే వరకు ఎవరినీ విదేశీయులుగా పరిగణించం."