ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు కరోనా. పల్లెల నుంచి పట్టణాలు, నగరాల వరకు... సర్వత్రా కరోనా గురించే చర్చ. ఇదే... ఉత్తర్ప్రదేశ్ సితాపూర్ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలకు వింత సమస్య తెచ్చిపెట్టింది. ఎందుకంటారా? ఆ గ్రామం పేరు 'కొరోనా' కాబట్టి.
కొద్ది రోజులుగా ఆ ఊరి జనం వారి గ్రామం పేరు చెప్పడానికే భయపడుతున్నారు. తమది కొరోనా గ్రామమని చెప్పగానే.. తమను దూరం పెడుతున్నారని గ్రామస్థులు లబోదిబోమంటున్నారు. తమకు 'కరోనా' రాలేదని, ఊరు పేరే 'కొరోనా' అని చెప్పినా వినిపించుకునే స్థితిలో ఇతరులు లేరని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఊరి పేరు వల్ల తమపై వివక్ష చూపుతారని కలలో కూడా అనుకోలేదని వాపోతున్నారు గ్రామస్థులు.
"మాది కొరోనా గ్రామమని చెప్పగానే మమ్మల్ని తాకడానికి సంకోచిస్తున్నారు. ఊరు పేరు, రోగం పేరుకు మధ్య తేడా అర్థం చేసుకోవట్లేదు. అందుకే మా గ్రామస్థులు ఎవరూ బయటకు రావడం లేదు. రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి."
-కొరోనా గ్రామస్థుడు.