కరోనా మహమ్మారి కరాళ నృత్యానికి ప్రపంచం వణికిపోతుంది. భారత్‌లో వైరస్ వ్యాప్తి ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ చర్యలు కొంత సానుకూల ప్రభావం చూపినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిని సామాన్య ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అనంతరం ప్రభుత్వం దశలవారీగా లాక్‌డౌన్ సడలిస్తూ కొవిడ్ నియమావళితో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగసాగాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలు ప్రారంభమైనప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులు ఇటీవల నివేదించారు.
తీవ్ర కలకలం..
లాక్‌డౌన్ సమయంలో మెజారిటీ కేసులు పట్టణాలకే పరిమితమైనా.. నేడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించడంతో అటు ప్రజల్లో, ఇటు ప్రభుత్వంలో ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు వ్యవస్థను గాడిలో పెట్టే ప్రభుత్వాధినేతల నుంచి ఉన్నతాధికారుల వరకు వ్యాధి బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వీయ నిర్బంధంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం ఉద్యోగులు పని చేసేలా ఆదేశాలు కూడా జారీ చేసింది.
పట్టణ ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాలు మరోసారి కఠిన లాక్‌డౌన్ అమలు చేయగా, మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్చిస్తున్నాయి. ఇటీవల నగరాల నుంచి కాలినడకన గ్రామాలకు తరలి వెళ్తున్న వలస కూలీల ద్వారానూ కరోనా వైరస్ గ్రామాలకు సోకే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ వ్యాజ్యం సందర్భంగా పేర్కొంది. ఈ విషయం గ్రామ ప్రాంతాల్లో రాబోయే వైరస్ ముప్పును ధ్రువీకరిస్తుంది. ఈ పరిణామాలు ప్రజల్ని ఆలోచింపజేస్తూ స్వీయ అప్రమత్తతకు పురిగొల్పుతున్నాయి.
విచక్షణ రహితంగా..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నకొద్దీ వ్యాధి పట్ల ప్రజల్లో అప్రమత్తతతో పాటు అపోహలు, అనుమానాలూ పెరుగుతున్నాయి. వైరస్ సోకినట్లు అనుమానించే వారిపై దుర్విచక్షణతో వ్యవహరించడం, కొన్నిచోట్ల వారిపై దాడికి దిగడం వంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. కొవిడ్ వ్యాధితో మృతి చెందినవారి దేహాలకు శ్మశానాల్లో అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవడంవంటివీ అమానవీయ చర్యలే. వైరస్ ఉందనే అనుమానంతో సాటి మనిషికి సహాయం నిరాకరించడం, కుటుంబాలను ఇంటి నుంచి గెంటివేయడం, గ్రామస్తులు కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించడం, దహన సంస్కారాలు నిరాకరించడం లాంటి ఉదంతాలు సిగ్గుచేటు.
మానసికంగా కుంగిపోతున్న ప్రజలు..