తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2020, 11:26 AM IST

ETV Bharat / bharat

కరోనా కాలంలో కొత్త భయం- ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు

అసలే కరోనా కాలం.. ఎటు చూసినా భయం భయం. వైరస్​ తెచ్చిన వణుకుతో ఇళ్లకే పరిమితమైన ప్రజలను కొంతమంది ఆకతాయిలు చేసే పనులు మరింత భయపెడుతున్నాయి. బిహార్​లోని సహస్ర పట్టణంలో ఓ అగంతకుడు పలు ఇంటి గుమ్మాల ముందు కరెన్సీ నోట్లు ఉంచుతున్నాడు. వాటితో పాటు ఓ చీటీలో 'నేను కరోనాతో వచ్చాను' అని రాస్తున్నాడు. ఇంకేముంది ప్రజలు కరెన్సీ నోటును చూసి ఆమడదూరం పరిగెడుతున్నారు.

currency-notes
కరోనా కాలంలో కొత్త భయం- ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లోని ఓ పట్టణంలో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండడం.. ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని సహస్ర పట్టణంలో ఓ అగంతకుడు పలు ఇంటి గుమ్మాల ముందు కరెన్సీ నోట్లు ఉంచుతున్నాడు. వాటితో పాటు ఓ చీటీలో 'నేను కరోనాతో వచ్చాను. ఈ నోటును స్వీకరించండి, లేకుంటే ప్రతిఒక్కరినీ వేధిస్తాను' అని అందులో రాశాడు. ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 నోట్లు లభ్యమవుతున్నాయి. గత శుక్రవారం నుంచి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ముగ్గురు ఇంటి యజమానులు తమ ఇంటిముందు కరెన్సీ నోట్లు దొరికినట్లు పోలీసులకు తెలిపారు. చీటీల్లోని చేతిరాతను బట్టి ఒకే వ్యక్తి ఈ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేవలం ఆటపట్టించడానికి ఆ వ్యక్తి ఇలా చేస్తుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇతరుల నుంచి వస్తువులు స్వీకరించేందుకూ ఇష్టపడటంలేదు. మరోవైపు కరెన్సీ నోట్ల మార్పిడి ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందా అనే అంశంపై విచారణ జరిపించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను గత నెలలో అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కోరింది. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసింది. కాగా కరెన్సీ నోట్ల ద్వారా ఈ వైరస్‌ సోకుతుంది అని చెప్పడానికి ఇప్పటివరకు శాస్త్రీయంగా ఎలాంటి రుజువు లభించలేదు.

ABOUT THE AUTHOR

...view details