ఔరా: న్యూస్ పేపర్లతో పర్యావరణ హిత పెన్సిళ్లు! తలచుకుంటే సాధ్యం కానిది ఏమీ ఉండదని నిరూపించింది ఆ జంట. పెరిగిపోతున్న వ్యర్థాలకు చెక్ పెట్టే దిశగా వినూత్న ఆలోచన చేసింది. తేదీ మారిపోగానే ఉపయోగం తగ్గిపోయే వార్తా పేపర్లతో పర్యావరణ హితమైన వస్తువులను రూపొందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుతో పెన్సిళ్లు తయారు చేస్తూ ఔరా అనిపిస్తోంది.
గుజరాత్‌కు చెందిన వ్యాపార వర్గాల్లో వాపి కుటుంబం ఒకటి. ఓ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వాపి పరివారానికి చెందిన కునాల్ పిటాలియా-శ్రుతి పిటాలియా దంపతులు ప్రధాని ఇచ్చిన 'గో గ్రీన్' నినాదాన్ని వ్యాపార ఆలోచనగా మార్చుకున్నారు. వినియోగం పూర్తయిన న్యూస్ పేపర్లతో పర్యావరణ హిత పెన్సిళ్లను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా పూలమొక్కలు, కూరగాయలు పండిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.
" నాలుగు సంవత్సరాల ముందు మేం ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యావరణాన్ని కాపాడేందుకు 'గో గ్రీన్' పిలుపు ఇచ్చారు. ఈ పిలుపుతో అప్పుడే మేము పర్యావరణహితమైన ఓ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచించాం. ఎంతో కసరత్తు అనంతరం పేపర్ పెన్సిళ్లు తయారు చేయాలని నిర్ణయించాం. పేపర్ పెన్సిళ్లు తయారీ ప్రారంభించి నేటి వరకూ కొనసాగిస్తూ వస్తున్నాం."
--- శ్రుతి పిటానియా
'కీన్ పెన్సిల్' అని నామకరణం
గ్రాఫైట్, కలపతో తయారయ్యే పెన్సిళ్లు పర్యావరణానికి హానిచేస్తాయని భావించిన పిటాలియా దంపతులు న్యూస్ పేపర్లతో పెన్సిళ్లు తయారు చేస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ పర్యావరణ హిత పెన్సిళ్లకు 'కీన్ పెన్సిల్' అని నామకరణం చేశారు.
" ఈ పెన్సిళ్లు తయారు చేయడానికి న్యూస్ పేపర్లను ఎంచుకున్నాం. అయితే పెన్సిళ్లు చిన్నవైతే పిల్లలు వాటిని వదిలేస్తారు. వినియోగించిన పెన్సిళ్లను వదిలేయద్దని పిల్లలకు సూచించడం ప్రారంభించాం. పెన్సిళ్ల చివర్లో తులసి, టమాటా, బంతి వంటి పలు రకాల విత్తనాలను అమర్చాం. వాటిని తీసుకుని కుండీల్లో ఉంచి మొక్కలు పెంచాలని చెప్పాం. దీనివల్ల పిల్లలకు చిన్నవయస్సులోనే పర్యావరణం పట్ల అవగాహన కలుగుతుంది.
--- శ్రుతి పిటానియా
పెన్సిల్లోనే విత్తనాలు..
ఈ పర్యావరణ హిత పెన్సిల్ చివరలో తులసి, జీలకర్ర, మెంతి, బంతి, టమాటా విత్తనాలు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ పెన్సిళ్ల ఉపయోగం పూర్తయిన తర్వాత కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేశారు పిటాలియా దంపతులు. దీని ద్వారా విద్యార్థులకు చిన్ననాటి నుంచే పర్యావరణాన్ని కాపాడటం అలవాటు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యావరణహిత పెన్సిళ్ల కోసం పలు కార్పొరేట్ విద్యాసంస్థలు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు ఇస్తున్నాయని సమాచారం.
ఇదీ చదవండి:నమస్తే ట్రంప్: ఆ రాత్రికయ్యే ఖర్చు ఎంతో తెలుసా?