ఇటీవల కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన కుష్బూ సుందర్ తమిళ రాజకీయాల్లో బిజీ అయ్యారు. విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీ అధ్యక్షుడు తిరుమవలవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమె చేపడుతున్న నిరసనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో కుష్బూను భాజపా ప్రోత్సహిస్తున్నా.. ఆ ఆందోళనల వెనుక ఆమె ఉద్దేశం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిరసనల వెనుక 15 ఏళ్ల నాటి ప్రతీకారం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమవలవన్ ఏమన్నారు..
నెల రోజుల క్రితం యూరోపియన్ పెరియరిస్ట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో చిదంబరం ఎంపీ, ఎస్సీ నాయకుడు, విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీ అధ్యక్షుడు తిరుమవలవన్ మను స్మృతిని కించపరిచేలా, మహిళలను అగౌరవ పరిచేలా వివాదాస్పద వాఖ్యలు చేసినట్లు హిందుత్వ సంఘాలు ఆరోపించాయి. ఆయన క్షమాపణ చెప్పాలంటూ భాజపా, ఆర్ఎస్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. భాజపా ఆందోళనల్లో కుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుష్బూ సుందర్‌ను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమవలవన్ క్షమాపణ చెప్పే వరకు నిరసనలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.
ప్రతీకారం దేనికి?
2005లో పెళ్లికి ముందుకు సెక్స్ తప్పు కాదని కుష్బూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
"ఏ విద్యావంతుడు తనకు కాబోయే భార్య కన్యగా ఉండాలని ఆశించడు. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొనాలనుకునే మహిళ.. తాను గర్భవతి కాకుండా, లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలి."
-2005లో కుష్బూ చేసిన వ్యాఖ్యలు