మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వ ఏర్పాటువైపు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేడు భేటీకానున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులపై అగ్రనేతలు చర్చించనున్నారు.
పవార్-సోనియా మధ్య భేటీ ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే.. ఆదివారం పుణెలో ఎన్సీపీ కోర్ కమిటీ సమావేశం జరగడం వల్ల అగ్రనేతల భేటీ వాయిదా పడింది.
ఎన్సీపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం.. పవార్-సోనియా గాంధీ మధ్య నేడు భేటీ ఉండనుందని ఆ పార్టీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.
"కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై చర్చించాం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ముగింపు పలికి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. పవార్ సోనియా గాంధీతో సమావేశమవుతారు. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చిస్తారు."
--- నవాబ్ మాలిక్, ఎన్సీపీ నేత.