తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీతో పవార్​ భేటీ.. సోనియా 'నో కామెంట్' - pawar modi meet

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ భేటీ అయ్యారు. మహారాష్ట్ర రైతు సమస్యలపై ప్రధానికి మూడు పేజీల లేఖ సమర్పించినట్లు పవార్ తెలిపారు. అయితే... మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం చర్చనీయాంశమైంది.

మోదీతో పవార్​ భేటీ.. సోనియా 'నో కామెంట్'

By

Published : Nov 20, 2019, 3:32 PM IST

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్​ పవార్ దిల్లీలో భేటీ అయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో సుమారు 30 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో రైతుల సమస్యలపై మోదీకి మూడు పేజీల లేఖ అందజేశారు పవార్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్ర రైతులకు దాదాపు 54 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు మోదీకి తెలిపారు పవార్. నాసిక్, నాగపూర్ జిల్లాలలో స్వయంగా పంట నష్టాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున తక్షణమే కేంద్రం జోక్యం చేసుకొని సహాయక చర్యలు చేపట్టాలని మోదీని కోరారు.

వేర్వేరు ప్రాంతాల్లో రైతుల దుస్థితిని మోదీకి వివరించారు పవార్. గత పది నెలల్లో నాసిక్ జిల్లాకు చెందిన 44 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.

రాజకీయ ప్రాధాన్యం...

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కారణంగా రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో మోదీ, పవార్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. శివసేన, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో పవార్​ ఉండగా... సోమవారం రాజ్యసభలో మోదీ... ఎన్సీపీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఫలితంగా తాజా సమావేశం అనేక ఊహాగానాలకు తావిచ్చింది.

ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు ఎన్సీపీ నేతలు.

'నో కామెంట్​'

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై స్పందించేందుకు నిరాకరించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పార్లమెంటు ప్రాంగణంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు 'నో కామెంట్' అని బదులిచ్చారు.

వచ్చే నెలలోగా మహారాష్ట్రలో శిససేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేత సంజయ్​ రౌత్ ధీమాగా చెబుతున్న నేపథ్యంలో సోనియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి: రజనీ​తో రాజకీయ మైత్రిపై కమల్​ కొత్త పలుకు

ABOUT THE AUTHOR

...view details