సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్య నేతలు పార్టీని వీడడం.. ఇవి చాలు ఒక పార్టీ చతికిలపడిందనడానికి. మరో వైపు కేసులు.. ప్రత్యర్థి కూటమి దూకుడు. ఇవి చాలు ఒక పార్టీ పనైపోయిందనడానికి. కానీ, ఎన్సీపీ అలా కాదు. సార్వత్రిక ఎన్నికలు జరిగి కొన్ని నెలల గడవక ముందే మళ్లీ పుంజుకుంది. భాజపా-శివసేనకు భారీ మెజార్టీ అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసినా.. వాటిని తలకిందులు చేస్తూ గట్టి పోటీ ఇచ్చింది. అధికారం మాట అటుంచితే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న భాజపా కలకు బ్రేక్ వేసింది. దీని వెనకున్నది మరెవరో కాదు.. రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత 78 ఏళ్ల శరద్ పవార్.
వలసలు వెంటాడినా..
సార్వత్రిక ఎన్నికల అనంతరం మహారాష్ట్ర ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజకీయ వలసలు జోరుగా సాగాయి. భాజపా-శివసేనలో భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి. వారిలో చాలా మంది ఎన్సీపీకి చెందిన నేతలే. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని కీలక నేతలు పార్టీని వీడారు. మరీ ముఖ్యంగా ఉదయన్ రాజే బోసలే పార్టీని వీడడం పెద్ద ఎదురుదెబ్బ. పవార్ అనుచరులు, కుటుంబ సభ్యులు సైతం పార్టీని వీడి భాజపాలో చేరారు. అయినా పవార్ పట్టు వీడలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతో పాటు సతార్ స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా వర్షంలో సైతం ఆయన ప్రసంగించిన తీరు ఓటర్లను కదిలించింది. ఆ ఘటన ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ పాటిల్ ఆధిక్యంలో నిలిపేలా చేసింది.
ఈడీతో ఢీ..