దేశ పోలీసు వ్యవస్థలో కీలక సంస్కరణకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. రికార్డుల నిర్వహణ, పాస్‌పోర్టుల వెరిఫికేషన్ వంటి పోలీసింగేతర బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యోచిస్తోంది! తద్వారా పోలీసులు వారి ప్రాథమిక కర్తవ్యంపై మరింత బాగా దృష్టి పెడతారని.. శాంతి భద్రతల పరిరక్షణ మెరుగ్గా సాగుతుందని భావిస్తోంది. దాదాపు 25 పోలీసింగేతర విధుల నుంచి పోలీసులను తప్పించి.. వాటిని పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ద్వారా చేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు సదరు సేవలను ఔట్ సోర్సింగ్‌కు అప్పగించే అంశంపై అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీల అభిప్రాయాలను హోం శాఖ తాజాగా కోరింది.
పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రైవేటు చేతికి! - పాస్‌పోర్టు వెరిఫికేషన్
రికార్డుల నిర్వహణ, పాస్‌పోర్టుల వెరిఫికేషన్ వంటి పోలీసింగేతర బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దాదాపు 25 పోలీసింగేతర విధుల నుంచి పోలీసులను తప్పించి.. వాటిని పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ద్వారా చేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది.
'పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ' చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా కేంద్రం తాజా ప్రతిపాదనను తీసుకొచ్చింది. పోస్టల్ మెటీరియళ్ల డెలివరీ, సమన్ల అందజేత, పాస్‌పోర్టుల వెరిఫికేషన్, సీసీటీవీ కంట్రోల్ రూం పర్యవేక్షణ, డ్రైవింగ్, వంట, దుస్తులు ఉతకడం, పాఠశాలలు-కళాశాలలకు భద్రత కల్పించడం వంటివి కేంద్రం గుర్తించిన 25 పోలీసింగేతర విధుల్లో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. రికార్డుల నిర్వహణ, పాస్‌పోర్టుల వెరిఫికేషన్ వంటి పనులను ప్రైవేటుకు అప్పగించే యోచన సరికాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాజా ప్రతిపాదనపై రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చునని.. ఆయా రాష్ట్రాల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకున్నాకే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఓ అధికారి వెల్లడించారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ