తీవ్ర గందరగోళం మధ్య ఆదివారం వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బిల్లులు.. రైతుల జీవితాల్లో పెను మార్పులు తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు తోమర్.
బిల్లుల విషయంలో.. విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
"వ్యవసాయానికి సంబంధించిన ఈ రెండు బిల్లులు చారిత్రాత్మకమైనవి. రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ఇకపై వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. ప్రధాని మోదీ.. తన నాయకత్వంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించారు."
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి