భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి పర్యటించనున్నారు. ఆయన రాకకు ఇంకా 8 రోజులే సమయం ఉండటం వల్ల వాణిజ్య ఒప్పందం, ఇతర అంశాలపై అటు భారత్, ఇటు అమెరికా రెండు పక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలను వాణిజ్యం మాత్రమే నిర్వచించలేదని అంటున్నారు కార్నెజీ ఇండియా డైరెక్టర్ రుద్ర చౌదరి.
వాణిజ్య ఒప్పందం ఇప్పటికీ అసంభవంగానే కనిపిస్తుందని చౌదరి అభిప్రాయపడ్డారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి లైతీజర్తో స్పష్టమైన చర్చలు జరపాల్సి ఉంటుందన్నారు. సీనియర్ పాత్రికేయులు స్మితా శర్మతో ముఖాముఖిలో అనేక విషయాలు వెల్లడించారు చౌదరి.
రుద్ర చౌదరితో స్మితా శర్మ ముఖాముఖి ప్ర. ట్రంప్ పర్యటనలో ఏఏ విషయాలకు ప్రాముఖ్యం ఉంటుందని భావిస్తున్నారు? అంచనాలు ఏంటి?
జ. భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన అంటేనే ప్రత్యేకం. భారత్‌లో ఆయన రెండు రోజులు ఉంటారు. అంతేకాదు.. ఓ పెద్ద బహిరంగ సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొంటారు. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేదే. ప్రతి దేశానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అమెరికాతో సంబంధాలు అవసరమే. అయితే భారత్‌పై దృష్టి పెట్టేందుకు అమెరికాతో పాటు ట్రంప్‌కు ఇదే మంచి సమయం.
ప్ర. కానీ.. ప్రధాని మోదీని ట్రంప్ చాలాసార్లు అనుకరించారు. హార్లీ డేవిడ్సన్కు సంబంధించి గతంలో అనేక సార్లు వ్యాఖ్యానించారు. ఈ చర్యలు భారత్‌ను ఇబ్బందికి గురిచేశాయి. వీటిని ట్రంప్ దూకుడు చర్యలుగా భావించి.. వదిలేస్తే మంచిదంటారా?
జ. వాణిజ్యం చాలా ముఖ్యమైనది. తేలికగా తీసుకునే అంశం కాదు. వ్యూహాత్మక సంబంధాల్లో భాగంగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌కే కాదు ప్రపంచ దేశాలకూ షాక్ ఇచ్చారు. ఆయన ఎన్నికల ప్రచారంలో హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. అమెరికా మార్కెట్ సౌలభ్యంతో ఇతర దేశాలు విచ్చలవిడిగా లాభపడుతున్నాయని ట్రంప్ భావన. ఆ దారులన్నింటినీ మూసివేయటం భారత్‌కు నష్టదాయకం. అల్యూమినియం, స్టీల్, జీఎస్పీ హోదా విషయాలే ఇందుకు నిదర్శనం. ఇదే అసలు సమస్య. అధ్యక్షుడి పర్యటన కారణంగా 18 నెలలుగా మూలకు పడిన ఒప్పందానికి పాక్షికంగానైనా మోక్షం లభించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ట్రంప్‌తో కన్నా లైతీజర్తో చర్చలే ఫలితాన్ని ఇస్తాయి.
ప్ర. భారత్ మీదున్న ప్రధాన ఒత్తిడి వాణిజ్య లోటు. దీనిని తగ్గించేందుకు చమురు, సహజవాయువు, రక్షణ పరికరాల కొనుగోలుకు అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో ఏం జరగబోతుంది?
జ. వాణిజ్య సంబంధాల్లో లైతీజర్కు 30 ఏళ్ల అనుభవం ఉంది. 80, 90 దశకాల తరహాలో ఆంక్షలు, సుంకాల ద్వారా తన పంతం నెగ్గించుకోవాలని అమెరికా చూస్తోంది. వాణిజ్య లోటుగా భావించే విషయంలో సుంకాలు, ఆంక్షలు పెంచుతోంది అగ్రరాజ్యం. రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో రక్షణ రంగమే ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ, అణు ఒప్పందం గురించే ఎక్కవగా ప్రస్తావన వస్తుంది. అయితే రెండు దేశాల మధ్య అణుఒప్పందం మళ్లీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ పర్యటన నుంచి పెద్దగా ఆశించలేం. భారత్-అమెరికా వ్యుహాత్మక అవసరాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఎలాంటి ఒప్పందం జరగకపోయే అవకాశమూ ఉంది. కానీ ఇది పర్యటన ప్రాముఖ్యాన్ని దెబ్బతీయదు. రక్షణ రంగం వైపు చూస్తే.. కొత్త సాంకేతికతలతో పాటు పరిశోధన, అభివృద్ధి హబ్‌ల ఏర్పాటుపై చర్చ జరగవచ్చు.
ప్ర. కాట్సా.. అమెరికా వ్యతిరేకులను ఆంక్షల రూపంలో ఎదుర్కొనే ఆయుధం. రష్యాతో ఎస్-400 క్షిపణుల కొనుగోలు వ్యవహారంలో భారత్‌పై ఇప్పటికీ కాట్సా కత్తి వేలాడుతోంది. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందా?
జ. రష్యా గానీ ఇరాన్ విషయంలో గానీ భారత ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని చిన్నదిగా ఎవరూ భావించరని నా అంచనా. కానీ అమెరికాతో ఎంతో పరివర్తనతో వ్యవహరించాం. కాట్సా తంత్రాన్ని తప్పించుకోగలిగాం. ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో చమురు విషయంలో ఇబ్బంది పడినా.. ఆ దేశంతో పాటు రష్యా, అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగించగలిగాం. ఇదేదో అకస్మాత్తుగా వచ్చిన మార్పేమీ కాదు. ఎప్పటి నుంచో అనేక వ్యుహాలు రచించే.. అమెరికాతో ఆచితూచి యుక్తితో వ్యవహరిస్తున్నాం. ఈ పద్ధతిలో భారత్‌కు అనుకూలమైన అంశాలను ట్రంప్ నుంచి సాధించుకునే అవకాశం ఉందని నా భావన.
ప్ర. డోక్లాం ఘటన తర్వాత చైనా, రష్యాతో సంబంధాలను పునరుద్ధరించుకున్నాం. ఎందుకు? ఉద్రిక్తతల సమయంలో భారత్ అంచనాల మేరకు అమెరికా వ్యవహరించలేదనా? లేదా అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలని ట్రంప్ ఆశిస్తున్నా.. పాక్‌తో కలివిడిగా ఉండటమా?
జ. డోక్లాం విషయంలో అమెరికా మద్దతు కోసం భారత్ ఎదురుచూడలేదనే నేను భావిస్తున్నా. అప్పుడు అమెరికా చేసిన ప్రకటనలన్నీ సానుకూలంగానే ఉన్నాయి. మరో విషయమేమిటంటే.. డోక్లాంలో ఉద్రిక్తతలు పెరగాలని భారత్ భావించలేదు. అమెరికా జోక్యాన్ని కోరుకోలేదు. డోక్లాం కారణంగా భారత్ అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడలేదు.
పాకిస్థాన్ విషయానికి వస్తే... ప్రపంచ నేతలతో వ్యవహరించినట్లుగానే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోనూ ట్రంప్ మెలుగుతున్నారు. ఇమ్రాన్ ఇటీవలి అమెరికా పర్యటన ఫలవంతంగా సాగింది. అయితే ఇది పాక్‌పై అమెరికా దృష్టి కోణాన్ని మార్చలేదు. ఉగ్రవాదంపై ఒత్తిడి చేస్తూనే ఉంది. తాజాగా ఎఫ్ఏటీఎఫ్ ఒత్తిడితో ఉగ్ర గురువు హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకుంది. ఇది మంచి విషయమే.. కానీ ఇలాంటివి ఇంతకుముందు ఎన్నో జరిగాయి. ఇమ్రాన్ పర్యటన కారణంగా ఆ దేశంపై ఉన్న ఒత్తిడికి విముక్తి లభించదు.
ప్ర. అమెరికా కాంగ్రెస్‌లో కశ్మీర్ విషయానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదం లభించింది. కశ్మీర్, సీఏఏ, ఎన్ఆర్సీపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియోకు నలుగురు సెనేటర్లు లేఖ రాశారు. వీటిని ట్రంప్ పర్యటనలో భారత్ లేవనెత్తుతుందా?
జ. ఇటువంటి విషయాల్లో అమెరికాలోని భారత మిషన్, అధికారులు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తారు. అమెరికా కాంగ్రెస్‌తో భారత అధికారుల మధ్య ఆరోగ్యకరమైన చర్చలే సాగుతాయి. విదేశాంగ విధానానికి సంబంధించి అమెరికా కాంగ్రెస్ వివిధ అంశాలపై చర్చిస్తాయి. వీటి గురించి మోదీ-ట్రంప్ మధ్య చర్చకు రావటం చాలా కష్టం. ఆ సమస్య అధికారుల వరకే పరిమితం. ఈ విషయంపై ట్రంప్ చర్చించారంటే ఆయన పర్యటన ఎలాంటి ఎజెండా లేకుండా జరిగినట్లే. కొంతమంది రాసిన లేఖలు మోదీతో ట్రంప్ ఏం చర్చించాలో నిర్దేశించలేవు.
ప్ర. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారు. హెచ్-1బీ వీసాలకు సంబంధించి భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం ప్రస్తావనకు వస్తుందా?
జ. ఇది అసలైన సమస్య. ఇది భారతీయులకు పెద్ద దెబ్బ. హెచ్-1బీ వీసాలపై ఆంక్షలతో చాలా మంది భారతీయులకే ఎక్కువ నష్టం జరిగింది. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. కానీ ఇవి అధికారుల స్థాయికి సంబంధించినవే. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికే నిర్దేశించినది. లైతీజర్తో చర్చలతో రెండు దేశాల మధ్య పాక్షిక ఒప్పందం జరుగుతుందని నా అంచనా.