బిహార్‌లో గోపాల్‌గంజ్ వద్ద గండక్ నదిపై నిర్మించిన పైవంతెన కూలిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించిన నెల రోజులకే నిర్మాణంలోని కొంత భాగం కూలిపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గోపాల్‌గంజ్- తూర్పు చంపారన్‌ను కలుపుతూ 1.4 కిలోమీటర్ల పొడవున రూ.264 కోట్ల వ్యయంతో నిర్మించారు. గత నెల 16న దీన్ని సీఎం నితీశ్ ప్రారంభించారు. అయితే, బ్రిడ్జి కొంతభాగం బుధవారం కూలి నదిలో కొట్టుకుపోయింది.
'ఆయన ఎలుకలు మద్యాన్ని తాగుతాయ్ తెలుసా..'
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఘటన విపక్షాలకు ఇది ఆయుధంగా దొరికింది. 'రూ.263.47 కోట్లతో 8 ఏళ్ల పాటు నిర్మితమైన బ్రిడ్జిని నితీశ్ ప్రారంభించిన 29 రోజులకే కూలిపోయింది. అంత ఆత్రుతగా ఎవరి మెప్పు పొందడానికి ఈ బ్రిడ్జిని ప్రారంభించారు' అని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. బ్రిడ్జిని నిర్మించిన కంపెనీని నిషేధించాలని డిమాండ్ చేశారు. ''ఈ విషయంలో ఎవరైనా నితీశ్‌ను ఎవరైనా అవినీతి పరుడని అంటారేమో.. ఆయన ఎలుకలు కూడా ఈ మొత్తం మద్యాన్ని తాగేస్తాయ్ తెలుసా'' అంటూ ఎద్దేవాచేశారు.