ఓ ఇంజినీర్ రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసా... ఆరెఎస్ఎస్ కార్యకర్త నుంచి రక్షణమంత్రిగా ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా... గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆ విషయం బోధపడుతుంది.
పాఠశాల దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరారు పారికర్. ఐఐటీ నుంచి పట్టభద్రుడైన అనంతరమూ అందులోనే కొనసాగారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా అంగీకరించేందుకు ఏమాత్రం సంకోచించని ముక్కుసూటి వ్యవహార శైలి పారికర్ సొంతం.
అనంతర కాలంలో ఆధునిక భావాలున్న నేతగా రూపాంతరం చెందారు పారికర్. సాధారణ జీవనశైలి, అసాధారణ నడవడికతో గోవా ప్రజల్లో మనవాడనే ముద్ర వేయగలిగారు. రాష్ట్రంలో భాజపాకు ట్రబుల్ షూటర్‌గా ఎదిగి రెండు దశాబ్దాల పాటు గోవా రాజకీయాల్ని శాసించారు.
సాధారణ దుస్తులు ధరించి రిక్షాలో విమానాశ్రయానికి వెళ్లేవారు పారికర్. తన వస్తువులు తానే మోసుకుంటూ దిల్లీ నార్త్‌బ్లాక్‌లో కనిపించేవారు. ఎంత సాదాసీదాగా ఉండేవారో నిర్ణయాల్లో అంతే కటువుగా ఉండేవారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయ ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా తప్పుపట్టినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. ఆర్ఎస్ఎస్ బోధనలే లక్షిత దాడులపై నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేశాయని బాహాటంగా ప్రకటించుకున్నారు పారికర్.
ఓ ఆహార నాళికను నాసికలో ధరించి గోవా అభివృద్ధి పనుల్ని పరిశీలించిన పారికర్‌ను గుర్తుచేసుకుంటే ఆయనలోని నిబద్ధత కళ్లకు కడుతుంది. 2018 ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పారికర్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజులుగా గోవా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ అనంత లోకాలకు చేరారు.
ఇదీ చూడండి: గోవా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి?