గోవా ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపించారు ఆ రాష్ట్ర మంత్రి విజయ్ సర్దేశాయ్. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మనోహర్ పారికర్ ప్రజలకోసమే శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం పారికర్‌కు క్యాన్సర్ తీవ్రతరమైందని, మలిదశకు చేరుకుందని పేర్కొన్నారు పట్టణ ప్రణాళిక మంత్రి.
శ్మశానాల నిర్మాణానికి నిధుల మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలపడానికి పారికర్‌ను కలవడానికి వెళ్లనున్నారు విజయ్ సర్దేశాయ్.
గోవా ముఖ్యమంత్రిపై రాష్ట్ర మంత్రి ప్రశంసలు ''నేను ముఖ్యమంత్రి పారికర్‌ను కలవడానికి రేపు వెళ్తాను. మొదట శ్మశాన నిర్మాణానికి, స్థల కేటాయింపునకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలపాలి. పారికర్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ వారు చూపిన చొరవ అద్భుతం. ప్రజల బాగు కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం''
- విజయ్ సర్దేశాయ్, గోవా మంత్రి
''క్యాన్సర్ ఒక వ్యాధి. ఇది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మాత్రమే కలలను నాశనం చేయదు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుంది'' అని క్యాన్సర్ అవగాహన సమావేశానికి గతంలో ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మాట్లాడిన విషయాలు గుర్తుకుతెచ్చుకున్నారు మంత్రి.
''ఆ సమావేశంలో నేను మన ముఖ్యమంత్రిని ఉదాహరణగా తీసుకొని చెప్పాను. రాజకీయంగానే కాకుండా పారికర్ మాకు అత్యంత సన్నిహితులు. వారికి క్యాన్సర్ వస్తుందని మేం అసలు ఊహించలేదు. అది మా కలలను చంపేసింది. కానీ, దేవుని దయ వల్లే పారికర్ ఈ సమయంలోనూ మరింత శక్తిమంతంగా పనిచేయగలుగుతున్నారు.''
- విజయ్ సర్దేశాయ్, గోవా మంత్రి
గోవా వైద్య కళాశాల, ఆసుపత్రి(జీఎంసీహెచ్)లో వైద్యపరీక్షల నిమిత్తం ఆదివారం రోజు హాజరయ్యారు పారికర్. అనంతరం ఇంటికి వెళ్లిన పారికర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.
పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పారికర్ గత కొద్ది కాలంగా ఆసుపత్రులకే పరిమితమవుతున్నారు. గత ఫిబ్రవరి నుంచి గోవా, ముంబయి, దిల్లీ, న్యూయార్క్‌లలోని ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. పారికర్ ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న పుకార్లపై స్పందించారు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి. ముఖ్యమంత్రి వేగంగా కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.