ఎస్సీ, ఎస్టీ చట్టసభ సభ్యుల రిజర్వేషన్ల పెంపునకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. డిసెంబర్ 10న దిగువసభ ఆమోదం పొందిన రిజర్వేషన్ బిల్లుకు నేడు పెద్దలసభ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపింది. గత 70 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన.. 2020 జనవరి 25తో తీరిపోనుంది. ఈ నేపథ్యంలో మరో 10ఏళ్ల పాటు రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించింది మోదీ సర్కారు.
రాజ్యాంగ స్ఫూర్తికి మోదీ ప్రభుత్వం విఘాతం కలిగించదని స్పష్టం చేశారు న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్.
ఆంగ్లో-ఇండియన్లపై వాడీవేడీ చర్చ
ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై సభ్యులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే ఆంగ్లో-ఇండియన్లకు రిజర్వేషన్ పెంపుపై బిల్లులో పొందుపరచకపోవడం పట్ల విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభాపక్షనేత గులాం నబీ ఆజాద్‌తో సహా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం బిల్లుకు ఓటింగ్ సందర్భంగా సభలోకి వచ్చారు.
ప్రభుత్వం తెలిపినట్లుగా కేవలం 296 మంది మాత్రమే ఆంగ్లో ఇండియన్లు ఉంటే వారికి చెందిన సభ్యుడిని లోక్‌సభలో ఎలా నామినేట్ చేశారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ప్రశ్నించారు. కర్ణాటకలోనే 2 నుంచి 3 వేలమంది ఆంగ్లో-ఇండియన్లు ఉంటారని ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని జేడీఎస్ ఎంపీ కృపేంద్ర రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 'మోదీజీ... తక్షణం అత్యవసర పరిస్థితి విధించండి'