నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనా వేళ నిర్వహిస్తున్న తొలి పార్లమెంట్ సమావేశాలు ఇవే కావడం వల్ల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు.. ఈ ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించి ట్రయల్ రన్లను కూడా నిర్వహించారు.
ఉదయం రాజ్యసభ...
సాధారణ పరిస్థితుల్లో లోక్సభ, రాజ్యసభలు ఏకకాలంలో జరుగుతూ ఉండేవి. కరోనా నేపథ్యంలో ఉభయ సభల సమయాల్లోనూ మార్పులు చేశారు. తొలి రోజు ఉదయం లోక్సభ, మధ్యాహ్నం రాజ్యసభ జరగనుంది. ఆ తర్వాత నుంచి ఉదయం 11గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 2గంటలకు లోక్సభ సమావేశమవుతుంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేశారు.
ఈ నేపథ్యంలో ఈసారి ఉభయసభల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. కరోనా సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతల వంటి అస్త్రాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కూడా సిద్ధమయ్యాయి.
ఏర్పాట్లు ఇలా...
భౌతిక దూరం నియమాన్ని పక్కగా పాటించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సభ్యులు కూర్చునేందుకు ఛాంబర్లు, గ్యాలరీలను ఉపయోగించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మాట్లాడే సభ్యులను చూపించేందుకు నాలుగు పెద్ద స్క్రీన్లను ఛాంబర్లలో పెట్టారు. మరో ఆరు చిన్న స్క్రీన్లు, ఆడియో సెట్లను నాలుగు గ్యాలరీల్లో ఉంచారు.