కరోనా నేపథ్యంలో సెప్టెంబరు 14 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు భిన్నంగా జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు ఉభయ సభల్లోనూ జరపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ సభ్యులు కరోనా బారిన పడకుండా చూసేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకొక్క సభ(లోక్‌సభ, రాజ్యసభ) సమావేశం రోజుకు నాలుగు గంటలు మించి నిర్వహించకూడదని.. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది. వీటిపై వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాన్ని.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సేకరిస్తున్నారు.
అయితే ఇందుకు చాలా రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈసారి వర్షాకాల సమావేశాలు విరామం లేకుండా నిర్వహించాలని భావిస్తున్నట్లు జోషి చెప్పారు. "రోజుకు లోక్‌సభ నాలుగు గంటలు, రాజ్యసభ నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తాయి. వారాంతపు సెలవులను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. వాటిని కొనసాగిస్తే.. ఎంపీలు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కొవిడ్-19 ప్రమాదం ఎక్కువవుతుంది. సెలవులిస్తే.. అక్టోబర్ 1 తర్వాత కూడా పార్లమెంటును పొడిగించాల్సిన అవసరం ఏర్పడొచ్చు. ప్రస్తుత సమయంలో వ్యవధిని పెంచడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోంది" అని జోషి విలేకరులకు తెలిపారు.
ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చైనాతో సరిహద్దుల ఘర్షణను, కొవిడ్ మహమ్మారిపై భారత్ ప్రతిస్పందన అంశాలను ప్రధానంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు జోషి సంకేతాలిచ్చారు. వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం 20 బిల్లులు తేనుంది. ఇందులో మార్చి, ఆగస్టు మధ్యలో జారీ చేసిన 11 ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి.
రాజ్యసభ ఉదయం.. లోక్‌సభ సాయంత్రం