ఈశాన్య దిల్లీ అల్లర్లపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. నేడు పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే దేశ రాజధానిలో హింసకు కారణమైన సీఏఏపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. వీటిని తిప్పికొట్టాలని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది అధికార ఎన్డీఏ ప్రభుత్వం.
సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలో 45 మంది మృతి చెందారు. ఈ అల్లర్లను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. హింసాత్మక ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.
బడ్జెట్ ఆమోదమే తొలి ప్రాధాన్యం...
దిల్లీ అల్లర్లపై చర్చ కోసం పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. దిల్లీ అల్లర్ల అంశాన్ని గట్టిగా లేవనెత్తుతామని లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. తృణమూల్, సీపీఐ, సీపీఎం కూడా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నాయి.
సభ నియమాలకు అనుగుణంగా ఏ అంశంపైనైనా చర్చించేందుకు తాము సిద్ధమని.. అయితే ముందుగా వార్షిక బడ్జెట్ ఆమోదం పొందేలా చూడాలని పేర్కొన్నారు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్. దిల్లీ అల్లర్ల అంశాన్ని విపక్షాలు రాజకీయం చేయడం మాని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో చర్చించాలని అన్నారు.