పారా అథ్లెట్, పారాలింపిక్ పతక విజేత దీపా మాలిక్... భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె సొంత రాష్ట్రం హరియాణా.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన నచ్చే భాజాపాలో చేరుతున్నానని తెలిపారు దీపా మాలిక్. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.
హరియాణా ఐఎన్ఎల్డీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కెహర్ సింగ్ రావత్ కూడా భాజపాలో చేరారు. దిల్లీలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
మీడియాతో మాట్లాడుతున్న దీపామాలిక్ "మహిళలను శక్తిమంతులను చేయడం కోసం మోదీ కృషి చేస్తున్నారు. రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ వంటి కీలక మంత్రి పదవుల బాధ్యతలను మహిళలకు అప్పగించారు. స్మృతీ ఇరానీ, మేనకా గాంధీలు మంచి హోదాలో ఉన్నారు. దివ్యాంగుల కోసం సుగమ్య భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు."
-దీపా మాలిక్, పారా అథ్లెట్
పారాలింపిక్స్ గేమ్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళగా అరుదైన ఘనత సాధించారు దీపా. 2016లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్‌లో షాట్‌పుట్ క్రీడలో ఆమె రజత పతకం సాధించారు.