భారత్‌లో కరోనా వేగం పుంజుకుంటోంది. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క రోజులోనే అత్యధికంగా 1,750 కొత్త కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 23,452కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే.. లాక్డౌన్ విధించకుండా ఉంటే కేసులు లక్ష దాటి ఉండేవని... ప్రస్తుతం వైరస్ అదుపులోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
'మహా' బీభత్సం
దేశంలో కరోనాకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో మరో 394 కేసులు గుర్తించారు అధికారులు. ఇందులో అత్యధికంగా ముంబయి నుంచే 357 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కేసులు 6,817కి చేరగా.. ఒక్క ముంబయి నగరంలోనే 4,447 మంది బాధితులు ఉన్నారు.
ముంబయిలో మరణించిన 11 మందితో కలిపి రాష్ట్రంలో నిన్న 18 మంది ఈ మహమ్మారికి బలైనట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 301కి చేరింది. 117 మంది కోలుకోగా రాష్ట్రంలో వైరస్ బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 957కి చేరింది.
రాజధానిలో కరోనా
దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 2,514కి పెరిగింది. కొత్తగా 138 కేసులు నమోదు కాగా.. ముగ్గురు ఈ వైరస్‌కు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 53కి చేరుకుంది. ఇందులో సగానికి పైగా(29) మృతుల వయసు 60 ఏళ్ల పైనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. 14 మంది మృతులు 50-59 ఏళ్ల మధ్య ఉండగా.. మిగతా 10 మంది వయసు 50 ఏళ్ల లోపు ఉన్నట్లు స్పష్టం చేశారు.