అందమైన కట్టడాలతో పింక్ సిటీగా పేరుగాంచిన రాజస్థాన్ రాజధాని జైపుర్లో ఓ చిరుత హల్చల్ సృష్టిస్తోంది. అడవి నుంచి తప్పిపోయి నివాస ప్రాంతంలోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సుమారు 24 గంటలకుపైగా అటు ప్రజలకు, ఇటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దానిని పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
24 గంటలైనా..
గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో తఖ్తేశాహి రోడ్లోని నివాస ప్రాంతంలో చిరుతను గుర్తించారు స్థానికులు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కానీ.. అది అక్కడి నుంచి ఆర్బీఐ కార్యాలయం మీదుగా సుబోధ్ కళాశాల ప్రాంతంలోకి వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదయింది. అధికారులు అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది.