దేశంలోనే తొలి కరోనా కేసు నమోదైన కేరళలో ప్రస్తుతం ప్రజలు భయం గుప్పిట్లో రోజులు గడుపుతున్నారు. ఏ చిన్న వార్త వినిపించినా ఆందోళన చెందుతున్నారు. కరోనా బాధితులను కలిసిన వ్యక్తులు, వైద్యం అందించే డాక్టర్లు, నర్సులను చూస్తే ఆమడ దూరం పరిగెడుతున్నారు. కొట్టాయం జిల్లాలో నర్సులను ఇల్లు ఖాళీ చేయాలని యజమానులు అంటున్నారు. ప్రజల్లో భయానికి ఈ పరిస్థితి అద్దం పడుతోంది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 కేసులు నమోదయ్యాయి. 270 మంది నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. 4,180 మందిని పరిశీలనలో ఉంచారు. 22 మందిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
పక్కింటి వ్యక్తి మరణంతో..
కేరళ కొట్టాయం జిల్లా చెంగళం గ్రామంలో కరోనా బాధితుడి పొరుగింటిలో ఉండే వ్యక్తి శుక్రవారం మరణించాడు. అతడ్ని కొన్ని రోజులుగా నిర్బంధంలో ఉంచగా శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి మరణంతో చెంగళం గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా మహమ్మారి తమ గ్రామాన్ని చుట్టుముడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. చనిపోయిన వ్యక్తి కరోనాతో మరణించలేదని, గుండె పోటుతో మరణించినట్లు భావిస్తున్నామని జిల్లా పాలనాధికారి పీకే సుధీర్‌బాబు వెల్లడించారు. శవ పరీక్ష, కరోనా నమూనా పరీక్షల ఫలితాల తర్వాతే అసలు విషయం తెలుస్తుందని.. అతని కుమారుడే కరోనా సోకిన వ్యక్తిని కలిశాడు కానీ అతను కాదని స్పష్టం చేశారు.