శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా.. దేశంలో ఏదోమూల కుల వివక్ష, మూఢనమ్మకాలు వంటివి కనిపిస్తూనే ఉన్నాయి. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ఓ పంచాయతీ సర్పంచ్ జాతీయ జెండాను ఎగురవేయటాన్ని అడ్డుకున్నాడు మాజీ సర్పంచ్. ఆమె తక్కువ కులానికి చెందినదని.. జెండా ఎగురవేసేందుకు అనర్హురాలని అన్నాడు. ఈ ఘటన తమిళనాడు తిరవళ్లూరు జిల్లాలో జరిగింది.
అతుపక్కం పంచాయతీ ఎన్నికల్లో రొటేషన్ పద్ధతిలో భాగంగా అమృతం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పంచాయతీ కార్యాలయం వద్ద పంద్రాగస్టు వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసి, తీరా జెండా వందనం చేసే సమయానికి.. మాజీ సర్పంచ్ హరిదాస్ అక్కడికి వచ్చి అమృతం జెండా ఎగురవేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆమె తక్కువ కులానికి చెందినది కాబట్టి జెండాను ఎగురవేసేందుకు అనుమతించకూడదని వాదించాడు.