భారత్‌కు ఉగ్రమరక అంటించేందుకు పాకిస్థాన్ పెద్ద కుట్రే పన్నింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే వేళ పెద్ద వ్యూహమే రచించింది. మరో ‘కుల్‌భూషణ్ జాదవ్’ను సృష్టించేందుకు యత్నించింది. భారత భద్రతా సంస్థ అప్రమత్తమయ్యేసరికి దాయాదులకు భంగపాటు తప్పలేదు.
డి.వేణుమాధవ్ అనే ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకొని పాక్ ఈ కుట్ర పన్నింది. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన చదువులో అద్భుతంగా రాణిస్తూ పవర్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు.
ఆర్‌పీజీ గ్రూప్‌నకు చెందిన కేఈసీ ఇంటర్నేషనల్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సరఫరా మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులను ఆ సంస్థ చేస్తోంది. యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్‌లోనూ పునర్‌నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. ఈ విధుల కోసం 2016 డిసెంబర్‌లో వేణుమాధవ్ కూడా అఫ్గాన్ వెళ్లారు. అంతకుముందు వరకూ ఆయన చెన్నైలో పనిచేశారు. అఫ్గాన్‌లోని దష్ట్ ఎ అల్వాన్ వద్ద 500 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్నారు.
ఐఎస్‌ఐ కన్ను
వేణుమాధవ్‌పై పాక్ సైనిక గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ కన్నేసింది. ఆయనను తప్పుడు ఉగ్రవాద కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నింది. 2015లో 29 మంది మరణానికి కారణమైన పెషావర్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి కేసులో ఆయనను ఇరికించాలనుకుంది. అందులో భాగంగా ఆయనపై పెషావర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తారిక్ గిదార్ గ్రూప్ (టీజీజీ)నకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆర్థిక సాయాన్ని అందించినట్లు వేణుమాధవ్‌పై తప్పుడు కేసు పెట్టింది. పెషావర్‌లోని సైనిక పాఠశాలలో 132 మంది చిన్నారుల ఊచకోతకు సంబంధించి టీజీజీపై ఆరోపణలున్నాయి.
బోగస్ ఆధారాలతో ఐరాస వద్దకు..
పాక్ ఈ తప్పుడు కేసుతో వేణుమాధవ్ చుట్టూ కట్టుకథలు అల్లుతూ ఒక బోగస్ నివేదికను రూపొందించింది. దీనికి ఎఫ్‌ఐఆర్‌లు, ఫొటోలు, ఇతర కల్పిత ఆధారాలను జతచేసింది. ఐసిస్, అల్‌ఖైదా, జమాత్ ఉల్ అహ్రార్, టీజీజీ, తెహ్రాక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), ఐసిస్ వంటి పాక్ వ్యతిరేక ముఠాలకు ఆర్థిక సాయం, ఆయుధాలను సరఫరాకు ఆయన తోడ్పాటు అందించినట్లు చిత్రీకరించింది.