తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ వక్రబుద్ధి- సరిహద్దుల్లో మళ్లీ దాడులు

కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ మరోసారి ​తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్ హీరా నగర్​ సెక్టార్​లో దాడులకు తెగబడింది. పొరుగు దేశం కవ్వింపులకు భారత సరిహద్దు దళం కూడా దీటుగా సమాధానం చెప్పిందని అధికారులు తెలిపారు.

pakisthan shelling along loc in jammukashmir
పాక్​ వక్రబుద్ధి.. మరోసారి సరిహద్దు వెంట కాల్పులు

By

Published : Nov 29, 2020, 2:10 PM IST

కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్‌ రేంజర్లు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలు, భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాకిస్థాన్ బలగాలు రాత్రి కాల్పులు జరిపాయి. హీరానగర్ సెక్టార్‌లో పన్సార్‌, మన్యారి, కరోల్ కృష్ణ ప్రాంతాల్లో పాక్‌ బలగాలు దాడులకు పాల్పడగా... భారత సరిహద్దు భద్రతా దళం దీటుగా తిప్పికొట్టింది. రాత్రి పది గంటల ప్రాంతంలో మొదలైన కాల్పులు తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల వరకు కొనసాగినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.

భారత్ వైపు డ్రోన్‌ లాంటి వస్తువు పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లే వచ్చి వెనుదిరిగి పోయినట్లు బీఎస్​ఎఫ్​ అధికారులు వెల్లడించారు.

గత 8 నెలలుగా పాకిస్థాన్ తరచూ జరుపుతున్న దాడుల్లో సరిహద్దు గ్రామాల్లో అనేక మంది పౌరులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. అనేక మంది జవాన్లు వీర మరణం పొందారు. పాకిస్థాన్‌ దాడుల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రతి రాత్రి బంకర్లలో తలదాచుకోవడం కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చూడండి: పాక్ దుశ్చర్యకు ఇద్దరు భారత జవాన్లు బలి

ABOUT THE AUTHOR

...view details