భారత్ ఆశ్రయంలో పాక్ ఎమ్మెల్యే- స్వదేశం వైపే పీఓకే ప్రజల మొగ్గు! జమ్ముకశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ... ఆ దేశంలోని అరాచకాలు సంచలన రీతిలో బయటకువచ్చాయి. పాక్‌లో మైనారిటీ వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలోని తెహ్రీక్- ఏ-ఇన్సాఫ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే... భారత్‌లో ఆశ్రయం కోరారు.
నిత్యం తమ కుటుంబాన్ని దుండగులు వేధిస్తున్నారని... కుటుంబ భద్రత పరిగణనలోకి తీసుకొని భారత్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంతో పాక్‌లో ఏ తరహా శక్తులు రాజ్యమేలుతున్నాయో మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలైంది.
'ఆక్రమిత కశ్మీర్లో పాక్ వ్యతిరేక ఆందోళనలు'
పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొద్ది రోజులుగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు ఆ ప్రాంత జర్నలిస్టు, లండన్‌లో నివాసముంటున్న మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజారికా. జేకేఎల్ఎఫ్ సహా పలు సంస్థలు చేస్తున్న ర్యాలీలను పాక్ సైన్యం అణచివేస్తోందని... మీడియాపై ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. తమ కోసం ఏమైనా చేసేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని భావిస్తున్న ఆక్రమిత కశ్మీర్ ప్రజలపై దాడులకు దిగుతోందని తెలిపారు. భారత్‌కు అనుకూలంగా ఉన్న కశ్మీరీలను మైనారిటీలుగా చేసేందుకు పాక్ పంజాబ్‌కు చెందినవారిని పీఓకేలో నివాసం ఉండేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
"లండన్‌లో ఉంటున్న కశ్మీర్ జాతీయవాదనేతను కశ్మీర్‌పై అభిప్రాయం కోరాను. ఆయన చెప్పారు... మోదీ మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. పాక్ ఇన్నేళ్లుగా మన మీద దాడులు చేస్తోందన్నారు.. ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదులను తయారుచేస్తోంది... సరిహద్దు దాటి, భారత్‌పై దాడులు చేయి అని ప్రేరేపిస్తుందన్నారు. మరో స్వతంత్ర భావాలున్న కశ్మీరీ నేతతో మాట్లాడాను. పాకిస్థాన్ కావాలా, భారత్ కావాలా అని ఐరాస మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానమిస్తారు అని ప్రశ్నించాను. ఆయన స్థిరంగా చెప్పారు... నేను భారత్వైపేనని. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు భారత్‌ను మించిన మంచి ప్రత్యామ్నాయం లేదు."
_ఆరిఫ్ అజారికా, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జర్నలిస్టు
ఇదీ చూడండి: పాక్-చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావనేంటి?