తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పీవోకేలో చైనా విమానాలు.. భారత్​కు వ్యతిరేకంగా కుట్ర

సరిహద్దులో శాంతి నెలకొల్పుతామని ఒకవైపు నీతి వాక్యాలు చెబుతూనే.. మరోవైపు పాకిస్థాన్​తో కలిసి భారత్​కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది చైనా. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దూ వాయుసేన స్థావరంలో గత వారం చైనాకు చెందిన ఐఎల్‌-78 ట్యాంకర్‌ విమానాన్ని భారత్‌ గుర్తించింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వాయుసేన స్థావరాల్లో ఇటీవల కాలంలో కదలికలు చురుగ్గా ఉన్నట్లు భారత సైన్యం పసిగట్టింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్​ అవసరమైన ఆయుధ సామగ్రిని సిద్ధం చేసుకుంటోంది.

Pakistani-airbases-in-PoK-under-Indias-radar-after-Chinas-air-activity-increases-along-LAC
భారత్​కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న పాక్​-చైనా

By

Published : Jun 28, 2020, 12:59 PM IST

నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుంది డ్రాగన్‌ తీరు. ఓ పక్క గల్వాన్లో సమస్యపై చర్చిస్తూనే మరోపక్క బలగాలను మోహరిస్తోంది. ఇప్పటికే డ్రాగన్‌ తీరు గమనించిన భారత్‌ కూడా పూర్తిగా తన సన్నద్దతను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థను చైనా సరిహద్దులకు తరలించింది. ఈ క్రమంలో పాక్‌-చైనాలు సంయుక్తంగా భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం వేగవంతమైంది.

స్కర్దూ స్థావరంలో చైనా ట్యాంకర్‌ విమానం..

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దూ వాయుసేన స్థావరంలో గత వారం చైనాకు చెందిన ఐఎల్‌-78 ట్యాంకర్‌ విమానాన్ని భారత్‌ గుర్తించింది. ఈ విమానం యుద్ధవిమానాలకు గాల్లో ఇంధనం నింపుతుంది. తూర్పు లద్దాక్‌లో చైనా వాయుసేన కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటికి మద్దతుగా పీవోకేలోని స్కర్దూను కూడా ఉపయోగించుకొనే అవకాశం ఉంది.

చైనా వాయుసేన స్థావరల్లో పరిస్థితి ఇదీ..

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వాయుసేన స్థావరాల్లో ఇటీవల కాలంలో కదలికలు చురుగ్గా ఉన్నట్లు భారత సైన్యం గుర్తించింది. ముఖ్యంగా టిబెట్‌ వంటి చోట్ల నుంచి విమానాలు పూర్తి ఆయుధ సామర్థ్యంతో గాల్లోకి ఎగరడం అత్యంత కష్టం. ఇది సముద్ర మట్టం కంటే 4వేల అడుగుల ఎత్తులో ఉండటంతో విమానాలకు వివిధ సాంకేతిక సమస్యలు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో స్కర్దూ స్థావరాన్ని జె17 విమానాలకు అనువుగా పాక్‌ గతేడాది అభివృద్ధి చేసింది.

భారత్‌ మిగ్‌ 29ల వైపు మొగ్గు దేనికి..?

భారత్‌ అత్యవసరంగా 21 మిగ్‌29లు, 12 సుఖోయ్‌లు కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మిగ్‌ 29లు పూర్తిగా అప్‌గ్రేడ్‌ అయినవి. వీటిని మిగ్‌ 29 యూపీజీ అంటారు. వీటిల్లో రాడార్‌, నేవిగేషన్‌, జామర్లు వంటి కీలక అంశాలను అప్‌గ్రేడ్‌ చేశారు. ఆర్‌డీ 33 ఇంజిన్‌ను ఉపయోగించారు. వీటిలో భూతలంపై దాడులకు, నౌకాదళంలో వినియోగించేలా మార్పులు చేశారు. ఇప్పటికే 270 సుఖోయ్‌లు ఉండటం కొత్తగా వాటిని భారీ సంఖ్యలో తీసుకోవడంలేదు. మిగ్‌29ల డెలివరీ వేగంగా జరగనుండటం కూడా ప్రభుత్వం వీటివైపు మొగ్గు చూపడానికి కారణం.

భారత్‌ పైలట్లకు అమెరికా శిక్షణ..?

మిత్ర దేశాలైన జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలను బలోపేతం చేసేందుకు అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ది నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ 2021 కింద ఈ మూడు దేశాల యుద్ధపైలట్లకు అమెరికాలోని గువామ్‌ స్థావరంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు బిల్లును గురువారం అమెరికా సెనెట్‌ ఆమోదానికి పెట్టారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో అమెరికాకు ఉన్న బలహీనతలను సరిచేసుకోవడంతోపాటు మిత్రదేశాలను బలోపేతంచేసే అంశాలు దీనిలో ఉన్నాయి.

ఇదీ చూడండి: అరకోటి మందికి 'అమ్మ'గా ఆ దేశ ప్రధాని

ABOUT THE AUTHOR

...view details