ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. పారిస్ వేదికగా అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్ఏటీఎఫ్) సమావేశం కావడమే ఇందుకు కారణమని తెలిపారు. పాకిస్థాన్లో ఉగ్రకార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అంశంపై భేటీలో చర్చ జరుగుతోందన్నారు డోభాల్.
దిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్), ప్రత్యేక కార్యాచరణ దళం(ఎస్టీఎఫ్) సారథుల జాతీయ సదస్సులో ప్రసంగించారు డోభాల్.
"మనకు లభించిన ఆధారాలను సరైన సంస్థకు అందించాం. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోలేదు. వాస్తవాలు మారవు. మన భాధ్యత నిర్వర్తించాం. సరైన ప్రభావం ఉంటుంది. మన పోరాటం కొనసాగుతుంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని చెప్పొచ్చు. కానీ ఆధారాలేవి? ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందకు తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అంశంగా సమావేశం జరుగుతోంది. ఆ చర్యలు ఏంటనే విషయంపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. "
-అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశమూ యుద్ధం చేసేందుకు సిద్ధంగా లేదన్నారు డోభాల్. తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉన్నందు వల్ల అలాంటి సాహసం ఎవరూ చేయబోరని అభిప్రాయపడ్డారు.