నవంబర్‌లో నిర్వహించబోయే కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. త్వరలోనే మన్మోహన్‌కు ఆహ్వాన పత్రికను పంపించబోతున్నట్లు తెలిపారు. గురునానక్ 550వ జయంతి వేడుకలకు విచ్చేసే సిక్కులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఖురేషి పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని గురునానక్ మందిరాన్ని కర్తార్‌పుర్ నడవా కలుపుతుంది. రావి నది ఒడ్డున ఉన్న ప్రముఖ గురుద్వారాను సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. సిక్కుల మతగురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారు. ఇక్కడే తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ గురుద్వారాకు అంత ప్రాధాన్యం. దేశ విభజనకు ముందు నుంచీ పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఈ గురుద్వారాకు చాలా ప్రాముఖ్యం ఉంది.
నవంబర్ 9 నుంచి..
నవంబర్ 12న సిక్కుల మతగురువు బాబా గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని అదే నెల 9 నుంచే భారత సిక్కు యాత్రికులను అనుమతించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ప్రతి రోజు 5 వేల మందిని అనుమతించేందుకు అంగీకరించింది.