కరోనా విజృంభిస్తున్న క్లిష్ట సమయంలోనూ పాకిస్థాన్ కపట బుద్ధి ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్ కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద.. ఆ దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్‌లోని గ్రామాల్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడింది. పొరుగు దేశం దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సేనలకు భారత సైన్యం దీటైన జవాబిచ్చింది.
సముద్ర జలాల్లోనూ..
అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ప్రాదేశిక జలాల సరిహద్దు(ఐఎమ్బీఎల్) వద్ద పాకిస్థాన్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో.. భారత జాలరి ఒకరు గాయపడ్డారు. గుజరాత్‌లోని ఓఖా తీరప్రాంతంలో ఆదివారం రెండు పడవలు.. ఐఎమ్బీఎల్ సమీపంలోకి వెళ్లగా పాక్ సిబ్బంది ఎటువంటి హెచ్చరిక చేయకుండానే కాల్పులకు తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా జాలరులను పాక్ అధికారులు అదుపులోనికి తీసుకోగా.. భారత కోస్ట్‌గార్డులు వారిని విడిపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో నిబంధనలను సడలించింది గుజరాత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లారు.
మిలిటెంట్ల దాడి..
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మాజీ ఆర్మీజవానుకు గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.